- ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన
- ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నా ఇచ్చిన మాట తప్పం
- అన్నదాతలకు అండగా ఉంటాం
- కూటమి పార్టీలు కలిసి ఉంటేనే రాష్ట్రానికి భవిష్యత్తు
‘గత ప్రభుత్వ హయాంలో చతికిలబడ్డ అభివృద్ధిని మళ్లీ పరుగులు పెట్టించే విధంగా కూటమి పాలన సాగుతుంద’ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. బిడ్డలకు బంగారు భవిష్యత్తు, ఉపాధి లభిస్తుందనే ఆశతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించారు… వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలను క్షేత్రస్థాయిలో మనం నిలబెట్టాలని కూటమి శ్రేణులకు సూచించారు.
రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నా ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేస్తున్నామన్నారు. పిఠాపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ గా వాకపల్లి దేవి సూర్యప్రకాశ్, వైస్ ఛైర్మన్ గా గాది రాజాబాబు, డైరెక్టర్ల ప్రమాణస్వీకార మహోత్సవం ఆదివారం సాయంత్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి నాదెండ్ల మనోహర్, శాసనమండలిలో ప్రభుత్వ విప్ పి. హరిప్రసాద్ ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాం కాబట్టే ఈ రోజు ఇటువంటి కార్యక్రమం చేసుకోగలుగుతున్నాం. ప్రజలు మనపై ఉంచిన నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి.
ముఖ్యంగా పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ని 70 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారు. అందుకు తగ్గట్టే పవన్ కళ్యాణ్ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. రోడ్లు, మౌలిక వసతుల కల్పన, రైల్వే వంతెనలు ఇలా అని పనులను శరవేగంగా చేస్తూ రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నారు.
దళిత మహిళ వాకపల్లి దేవి సూర్యప్రకాష్ కి ఈ రోజు మార్కెట్ యార్డు ఛైర్మన్ గా అవకాశం కల్పించారు. ఈ పదవికి కోసం ఇద్దరు ముగ్గురు పోటీ పడినా పార్టీ కోసం వాకపల్లి దేవి దంపతులు పనిచేసిన విధానం నచ్చి పవన్ కళ్యాణ్ దేవి వైపు మొగ్గు చూపారు.
రైతు సంక్షేమానికి పెద్ద పీట
కూటమి పాలనలో అన్నదాతల సంక్షేమానికి పెద్ద పీట వేస్తాం. వైసీపీ ప్రభుత్వం రైతులకు రూ.1674 కోట్లు ధాన్యం బకాయిలు పెడితే కూటమి ప్రభుత్వం వచ్చిన నెలలోనే వాటిని చెల్లించాం. భారతదేశ చరిత్రలోనే మొట్ట మొదటసారిగా రూ.12,400 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశాం.
దీనికి సంబంధించి 8 లక్షల మంది రైతులకు 24 గంటల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేశాం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వారికి ఇవ్వాల్సిన సొమ్ము చెల్లించాం. ఒకటో తేదీ ఆదివారం రావడంతో ముందు రోజే అంటే నిన్నే 68 లక్షల మందికి పెన్షన్లు అందించాం.
ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నాం. రూ.13 వేలు వేతనం అందుకుంటున్నారని వైసీపీ హయాంలో పారిశుద్ధ్య కార్మికుల రేషన్ కార్డులు కోత పెట్టారు. అలాంటి పాలన మళ్లీ రాకుండా మనందరం కలిసికట్టుగా పని చేయాలి.
మూడు పార్టీలు కలిసి పని చేస్తేనే భవిష్యత్తు
కూటమిలోని మూడు పార్టీలు క్షేత్రస్థాయిలో కలిసి పని చేయడం అనేది అంత సులువు కాదు. కానీ మూడు పార్టీలు కలసికట్టుగా ఉంటేనే రాష్ట్రానికి, మనకు భవిష్యత్తు. గ్రామ స్థాయిలో పని చేసేటప్పుడు మనందరం ఒకే ఆలోచనతో ముందుకెళ్లాలి. ప్రభుత్వం అందిస్తోన్న పథకాలు ప్రజలకు చేరేలా కృషి చేయాలి.
రాష్ట్రం ఆదాయం పెంచాలి, రైతాంగానికి ఎటువంటి కష్టం రాకుండా ఆదుకోవాలి. వారికి సకాలంలో రుణాలు మంజూరు అయ్యేలా చూడాలి. ప్రతి పంటకు మద్దతు ధర కల్పించేలా ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తున్నాం.
రాష్ట్రంలో పండిన ప్రతి గింజా కొన్నాం
రాష్ట్రంలో 48 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలుకు మాత్రమే కేంద్రం అనుమతి ఇచ్చింది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇది సరిపోదని ఢిల్లీ పెద్దలతో మాట్లాడాలని నన్ను ప్రత్యేకంగా ఢిల్లీ పంపించారు. రాష్ట్రంలో పండిన ప్రతి గింజా కొనేలా కేంద్ర పెద్దలను ఒప్పించారు.
అకాల వర్షాలతో ధాన్యం తడిచిపోతుందని రైతాంగం ఆందోళన చెందుతుంటే మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేదని విధంగా 5 కోట్ల 13 లక్షల గోతాలు రైతులకు అందించాం. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే కనివిని ఎరుగని విధంగా 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాం. మనకు అన్నం పెట్టే అన్నదాతకు పార్టీలు ఉండవు. పార్టీలకు అతీతంగా వారిని ఆదుకోవాలి.