పంట బీమా కోసం అన్నదాతల పడిగాపులు

పంట బీమా కోసం అన్నదాతల పడిగాపులు
- 2024 ఖరీఫ్ వేరుశనగ వాతావరణ పంటల బీమా కోసం రైతన్నలు ఎదురుచూపు
- కేంద్రం వాటా ఎకరాకు రూ 1027 లు రైతుల ఖాతాల కు జమ
- రాష్ట్రం ,ఇన్సూరెన్స్ వాటా ఎకరాకు రూ 4859 ల కోసం రైతన్న ఎదురుచూపు
తుగ్గలి,ఆంధ్రప్రభ: రైతే దేశానికి వెన్నెముక అంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు పంటల సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నా రైతుల పట్ల ప్రభుత్వం కనికరం చూపడం లేదంటూ పలువురు రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని 50 గ్రామాల్లో రైతులు 2024 సంవత్సరం ఖరీఫ్ కింద దాదాపు 65 వేల ఎకరాలలో వివిధ రకాల పంటలు సాగు చేశారు.
అందులో 20వేల ఎకరాలలో 8 వేల మంది రైతులు వేరుశనగ పంటను సాగు చేశారు. 2024 ఖరీఫ్లో వేరుశనగ పంట సాగుచేసిన రైతులకు ప్రభుత్వమే వాతావరణ పంటల బీమా చెల్లించింది. అయితే రైతు ఎంతో కష్టపడి సాగుచేసిన వేరుశనగ పంట సకాలంలో వర్షాలు రాకపోవడంతో పంట దిగుబడి తగ్గింది. దీంతో ప్రభుత్వం ఎకరాకు పంటల బీమా కింద రూ 5887.55 లు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు.
గత నెల క్రితం రైతుల ఖాతాల కు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఎకరాకు రూ 1027.73 లు జమ చేసింది. అయితే రాష్ట్రం వాటా, ఇన్సూరెన్స్ కంపెనీ వాటా కింద ఎకరాకు ఇంకా రూ 4859.82 లు చెల్లించాల్సి ఉంది. రైతులకు కేంద్ర ప్రభుత్వం వాతావరణ పంటల బీమా కింద తమ వాటాగా ఎకరాకు రూ 1027.73 లు ఇప్పటికే చెల్లించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం, ఇన్సూరెన్స్ కంపెనీ ల వాటా రూ 4859.82 లు చెల్లించాల్సి ఉంది.
ఈ విషయంపై రైతుల కు వాతావరణ పంటల బీమా కింద రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీ వారు చెల్లించాలని, ఏ రాజకీయ పార్టీ నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వివిధ సంస్థలకు సకాలంలో ఇన్సూరెన్స్ డబ్బులు కంపెనీలు చెల్లిస్తాయని, అయితే రైతులకు న్యాయబద్ధంగా రావలసిన పంటల బీమా ను ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లించకపోయినప్పటికీ ఆ కంపెనీల పై ఎవరు ఒత్తిడి తీసుకురావడం లేదని రైతుల ఆవేదన చెందుతున్నారు.
ఇప్పటికైనా వామపక్ష పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధులు కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై, ఇన్సూరెన్స్ కంపెనీపై ఒత్తిడి తీసుకువచ్చి వేరుశనగ రైతులకు రావలసిన పంటలు బీమాను వచ్చే విధంగా చూడాలని రైతులు కోరుతున్నారు.
