ఉద్యోగ భద్రత కల్పించాలి

ఉద్యోగ భద్రత కల్పించాలి

నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన టీఎస్ యుటిఎఫ్, ఉపాధ్యాయులు

నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని మహేశ్వరం శివారులో ఉన్న అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ (యు ఆర్ ఎస్) లో సోమవారం భోజన విరామ సమయంలో కేజీబీవీ, యూఆర్‌ఎస్, ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ టి ఎస్ యు టి ఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా టి ఎస్ యు టి ఎఫ్ జిల్లా కార్యదర్శి కందగట్ల రమేష్ మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా కేజీబీవీ, యూఆర్‌ఎస్, ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వము వెంటనే వారికి మినిమం టైమ్ స్కేల్ మంజూరు చేయాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, ప్రభుత్వ ఉపాధ్యాయుల మాదిరిగా సాధారణ సెలవులు కల్పించాలని, అలాగే ప్రమాద బీమా సౌకర్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అదేవిధంగా తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే రోజుల్లో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మార్చి 20న నిర్వహించనున్న “చలో అసెంబ్లీ” కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని తమ హక్కుల కోసం పోరాడతామని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ నర్సంపేట మండల అధ్యక్షుడు మహమ్మద్ రాయబోసు, ప్రధాన కార్యదర్శి పేరబోయిన కుమారస్వామి, ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, కోశాధికారి అర్జున్ సాగర్ పాల్గొన్నారు. అలాగే పాఠశాల ప్రత్యేక అధికారి ఇషాక్ అలీ, ఉపాధ్యాయులు పులి రాంబాబు, శాతరాశి శ్రీకాంత్ మరియు బోధనేతర సిబ్బంది రోజా, క్రాంతి, అశోక్, సుమన్, లత తదితరులు పాల్గొన్నారు.