అమ్మలాగే ప్రతి మహిళను గౌరవించండి..

అమ్మలాగే ప్రతి మహిళను గౌరవించండి..

మహిళల పట్ల గౌరవం అనేది ఇంటి నుంచే మొదలవ్వాలలి
అమ్మను ఎంతలా గౌరవిస్తామో ప్రతి మహిళను అంతలా గౌరవించాలి
రాష్ట్ర అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకం
ఎమ్మెల్యే గిత్త జయసూర్య

నందికొట్కూర్, ఆంధ్రప్రభ : మహిళల పట్ల గౌరవం అనేది ఇంటి నుంచే మొదలవ్వాలని, అమ్మను ఎంతలా గౌరవిస్తామో ప్రతి మహిళను అంతలా గౌరవించాలని ఎమ్మెల్యే గిత్త జయసూర్య పిలుపునిచ్చారు. ఆదివారం నందికొట్కూరు పట్టణంలోని చామండి ఫంక్షన్ హాల్ లో భారీ ఎత్తున అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గిత్త జయసూర్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ.రాష్ట్ర అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, అందుకే తమ ప్రభుత్వం మహిళల ప్రతిభను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యతనిస్తోందన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడంతో మన బాధ్యత తీరిపోలేదని, మన రాష్ట్రంలో ఎక్కువ శాతం మహిళలకు అవకాశం ఇచ్చిన కూటమి కు ఆంధ్రప్రదేశలో ప్రజలు అధికారం ఇచ్చారని, అందుకే మహిళల ప్రాధాన్యతను గుర్తించి, బాధ్యతలను అప్పగించడంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఆయన తెలిపారు.మహిళను మనం శక్తితో పోలుస్తామని, అలాంటి మహిళలకు రక్షణ కల్పించలేకపోతే ఏ రాష్ట్రా నికి గౌరవం కాదని, ఇంతకు ముందు మహిళల వేధింపులు కొంతవరకే పరిమితమయ్యేవన్నారు. కానీ, సాంకేతిక అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో సోషల్ మీడియాలోనూ మహిళలపై వేధింపులు పెరిగిపోయాయని, అందుకే మనల్ని మనం సవరించు కొని బాధ్యతతో మెలగాల్సిన సమయం వచ్చిందని, సమాజంలో చట్టాలను చేయడం, పోలీసులు పర్యవేక్షించడమే కాదన్నారు. మనమంతా సామాజిక బాధ్యతగా భావిస్తేనే మహిళల రక్షణ సాధ్యమవుతుందని, మన ఇంటి ఆడబిడ్డలకు ఎలాంటి గౌరవం ఇస్తామో సమాజంలో ఆడబిడ్డలను అలాగే గౌరవించాలని సూచించారు.

కుటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు శక్తిమేర పదవులను కట్టబెట్టడమే కాకుండా, ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళల పేరు మీదే అందిస్తున్నామని ఆయన గుర్తు చేశారు.మహిళలు కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజానికి కూడా పునాది వంటివారని ఆయన పేర్కొన్నారు.తల్లి, అక్క, చెల్లి, భార్యగా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తూ కుటుంబాన్ని, సమాజాన్ని ముందుకు నడిపించే శక్తి మహిళలదని అన్నారు. మహిళల సాధికారత, విద్య, ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇస్తేనే సమాజం నిజమైన అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని అభిప్రాయపడ్డారు.ప్రతి మహిళ గౌరవంతో ఆత్మవిశ్వాసంతో జీవించే సమాజం నిర్మించడమే మన అందరి లక్ష్యమని తెలిపారు. మహిళా శక్తికి తాను వందనం చేస్తున్నట్లు పేర్కొంటూ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి వెంకటేశ్వర్లు యాదవ్ ఖాతా రమేష్ రెడ్డి అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు