పాదయాత్ర రోజులను మరువని ఉప ముఖ్యమంత్రి…

పాదయాత్ర రోజులను మరువని ఉప ముఖ్యమంత్రి…
ఉప ముఖ్యమంత్రి భట్టి తనయుడి వివాహ వేడుకల్లో పాల్గొన్న ఏజెన్సీ మహిళలు
ఆప్యాయతంగా ఆహ్వానించిన ఉపముఖ్యమంత్రి
పాదయాత్రకు సహకరించిన మహిళలకు ప్రత్యేక గుర్తింపు
వారి కోసం ప్రత్యేక వాహనం ఏర్పాటు
జైనూర్ / ఉట్నూర్, ఆంధ్రప్రభ : తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తనయుడు సూర్య విక్రమాదిత్య – సాక్షిల వివాహ వేడుకలు గురువారం హైదరాబాదులో జరగగా ఆ వేడుకల్లోఒక అపురూప ఘట్టం చోటుచేసుకుంది. రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీల మధ్య.. నాడు భట్టి విక్రమార్కతో కలిసి అడుగులేసిన సామాన్య ఆదివాసీ మహిళలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు బట్టి విక్రమార్క అదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ జిల్లాలో చేపట్టిన పాదయాత్రకు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని బూషిమెట్ట పంచాయతీ ఆదివాసి మహిళలు ప్రజలు ఆయనకు చూపిన ఆప్యాయత తో పాటు భోజన వసతి కల్పించడంతో ఆ రోజులను మరవకుండా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత బట్టి విక్రమార్క ఆయన కుమారుని వివాహ వేడుకలకు ప్రత్యేకంగా ఆహ్వానించారు దీంతో అధికారులు బూసి మెట్ట పంచాయతీకి చెందిన వాలి లక్ష్మీబాయి డాకు రే రుక్మ బాయి, సింధు, ఉట్నూర్ మండలంలోని దేవగూడ కు చెందిన మరప గంగుబాయి సుమన్ భాయి,సీడమ్ లక్ష్మీబాయి ఆ మహిళలను అధికారులు ప్రత్యేక వాహనంలో హైదరాబాద్ తీసుకువెళ్లి వివాహ వేడుకల్లో పాల్గొని ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కలిసి వేడుకల్లో నృత్యాలు చేసి నూతన వధూవరులను ఏజెన్సీ మహిళలు ఆశీర్వదించారు.
అడవి బిడ్డల అనుబంధం…
గత ఎన్నికలకు ముందు సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ జిల్లా బోథ్ నుంచి ఖమ్మం వరకు నిర్వహించిన పాదయాత్రలో వీరంతా భాగస్వాములయ్యారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలం బూసిమెట్ట కు చెందిన వాలే లక్ష్మీబాయి, డాకూర్ రుక్మబాయి, దుర్గ సిందు, ఉట్నూరు మండలం దేవగూడకు చెందిన మరప గంగుబాయి, సుమన్ బాయి, సీడం లక్ష్మీబాయి. వీరంతా పాదయాత్ర ఆద్యంతం ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా, ఎండ తీవ్రతకు భట్టి గారు అలసిపోకుండా, ఆయనకు ఆరోగ్యం దెబ్బతినకుండా తమ సంప్రదాయ ఆదివాసీ పానీయాలను అందించి ఆత్మీయతను చాటుకున్నారు.
మరువని కృతజ్ఞత.. పెళ్లి పీటలపై గౌరవం…
పదవులు వచ్చినా పాత రోజులను అభిమానులను మరువని భట్టి విక్రమార్క, తన కుమారుడి వివాహానికి వారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. వివాహ వేడుకకు హాజరైన ఆ ఆదివాసీ మహిళలను భట్టి దంపతులు ఆప్యాయంగా పలకరించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కేవలం అతిథులుగా మాత్రమే కాకుండా, వారికి వివాహ వేదికపైనే ప్రత్యేక స్థానం కల్పించి కూర్చోబెట్టడం అందరినీ ఆకట్టుకుంది. రాజకీయాల్లో మానవ సంబంధాలకు, కృతజ్ఞతకు ఈ ఘటన నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఈ వేడుకల్లో జైనూర్ మండలం నుండి ఎంపీడీవో సుధాకర్ రెడ్డి, బూసి మెట్ట పంచాయతీ కార్యదర్శి ఆనంద్ రావు ఉట్నూర్ మండలం నుండి మహిళలతో అధికారులు పాల్గొన్నారు.
