ముత్తోజి పేటలో భక్తి జ్వాలలు

ముత్తోజి పేటలో భక్తి జ్వాలలు

కొమ్మాల లక్ష్మి నరసింహ స్వామి జాతరకు,
ఘనమైన ప్రభ బండి,

నర్సంపేట, రూరల్ ఆంధ్రప్రభ: నర్సంపేట మున్సిపాలిటీ ముత్తోజిపేట 2వ వార్డ్‌లో ఆధ్యాత్మిక ఉత్సాహం ఉప్పొంగుతోంది. నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ శ్రీమతి కాంపెల్లి వీణ – విజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు (మార్చి 3, మంగళవారం) సాయంత్రం 7 గంటలకు కొమ్మలా లక్ష్మీ నరసింహ స్వామి జాతర సందర్భంగా ఘనంగా ప్రభ బండి కార్యక్రమం నిర్వహించనున్నారు.

ముత్తోజిపేట రెండవ వార్డ్ ప్రజల ఐక్యత, భక్తి, సాంప్రదాయాలకు ప్రతీకగా ఈ ప్రభ బండి నిలవనుంది. స్వామివారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరికీ శాంతి, సుఖసంపదలు చేకూరాలని సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కౌన్సిలర్ కాంపెల్లి వీణ తెలిపారు. ఎన్నికల అనంతరం ప్రజలకు మరింత చేరువ కావాలని, అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక విలువలను కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ జాతర ఏర్పాట్లు చేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు.

జాతర సందర్భంగా ప్రభ బండిని అందంగా అలంకరించి, భక్తి గీతాలు, మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపుగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రెండవ వార్డులో యువత, మహిళలు, పెద్దలు అందరూ కలసికట్టుగా ఏర్పాట్లలో పాల్గొంటుండటం విశేషం. ఈ కార్యక్రమం ముత్తోజిపేట రెండవ వార్డ్‌లో పండుగ వాతావరణాన్ని సృష్టిస్తోంది.

కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. ముత్తోజిపేట రెండవ వార్డ్ ప్రజల భక్తి, ఐక్యతకు ఈ ప్రభ బండి ప్రతీకగా నిలవనుందని స్థానికులు పేర్కొంటున్నారు.

ఆధ్యాత్మికతతో పాటు సామాజిక ఐక్యతను చాటిచెప్పే ఈ కార్యక్రమం ముత్తోజిపేటలో విశేష ఆకర్షణగా నిలవనుందని భావిస్తున్నారు

Leave a Reply