భయం వీడి పరీక్షలు నిర్భయంగా రాయాలి..

భయం వీడి పరీక్షలు నిర్భయంగా రాయాలి..
ప్రతి పరీక్షల్లో నువ్వే ఫస్ట్ అనుకో..
ప్రముఖ సైకాలజిస్ట్ ప్రకాష్ బానావత్
జన్నారం, ఆంధ్రప్రభ : పరీక్షలు అంటే భయం వీడి నిర్భయంగా రాయాలని, ప్రతి పరీక్షలో నువ్వే ఫస్ట్ అనుకొని ఇష్టం కొద్ది రాయాలని ప్రముఖ సైకాలజిస్ట్, స్థానిక మోటివేషన్ చారిటేబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రకాష్ బానావత్ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని పీఎంశ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినీలకు పరీక్షలపై గురువారం ప్రేరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎగ్జామ్స్ ఫియర్ ను నీడియర్ అనుకోవాలన్నారు. పరీక్షలు దగ్గర వస్తున్న కొద్ది విద్యార్థుల్లో ఒత్తిడి, భయం పెరిగి ఆందోళన చెందుతారని, సమయ ప్రణాళిక చేసుకోకపోవడం, చదివినది సంపూర్ణంగా అర్థం కాకపోవడం, పరీక్ష ఫెయిలవుతానేమోనని భయం,మంచి మార్కులు వస్తాయో లేదో అనే భయం, తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల నుంచి ఒత్తిడి కారణాల చేత విద్యార్థులు ఆందోళన చెందుతారని ఆయన తెలిపారు.
విద్యార్థులు పరీక్షలు ఆనందంగా రాయాలంటే ప్రధానంగా పీస్, ప్లాన్,ప్రిపరేషన్, ప్రజెంటేషన్ అనే నాలుగు చిట్కాలను పాటించగలిగితే పిల్లలు పరీక్షలు ఒత్తిడి లేకుండా అద్భుతంగా రాస్తారని ఆయన చెప్పారు. చదువుపై నమ్మకం పెట్టుకోవాలని,లోతైన శ్వాసతో మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలని,ఇతరులతో పోలికలు చేసుకోకుండా సమయ ప్రణాళిక, విషయ ప్రణాళిక, సంసిద్ధతను ఏర్పరచుకొని పరీక్ష గదిలో మంచి ప్రదర్శన ఇవ్వాలని ఆయన కోరారు.

పరీక్షకు సంబంధించిన అన్నింటిని ముందు సమకూర్చుకొని, పరీక్షకు వెళ్లే రోజు ఉదయాన్నే సంతోషంగా నిద్రలేవాలని, ప్రశ్న పత్రం చదువుకొని వచ్చిన జవాబులను ముందుగా రాయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోళ్ళ రామన్న, టీచర్లు పాల్గొన్నారు.
