హేతుబద్దీకరణ జీవో 25ను సవరించాలి

హేతుబద్దీకరణ జీవో 25ను సవరించాలి
- ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్
భైంసా, ఆంధ్రప్రభ ; విద్యారంగ సంక్షేమం కోసం ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణకు సంబంధించిన జీవో 25ను తక్షణమే సవరించాలని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం భైంసాలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఎస్ ఉపాధ్యాయులకు సంబంధించిన డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలని సూచించారు. మోడల్, ఎయిడెడ్, గురుకుల, కెజిబివి ఉపాధ్యాయులందరికీ నూతన హెల్త్ స్కీమ్‌ను వర్తింపజేయాలని ఆయన సూచించారు. సర్వీస్ రూల్స్ రూపొందించి అన్ని రకాల పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం నెలకు 700 కోట్ల స్థానంలో రూ.1500 కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గిరిజన సంక్షేమ శాఖలో సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలని, భాషా పండిత పోస్టులను ఉన్నతీకరించాలని కోరారు. బీహార్ తరహాలో టెట్ పరీక్ష ఉత్తీర్ణతకు సంబందించి కనీస అర్హత మార్కులను తగ్గించడంపై ముఖ్యమంత్రి సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ వేసవిలో బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయుటకు విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భూమన్న యాదవ్, లక్ష్మణ్, రాష్ట్ర బాధ్యులు నాగభూషణ్, బాజి రెడ్డి, పల్సీకర్ శ్రీనివాస్, నాయకులు రవి జాదవ్, పిప్పర్ శ్రీనివాస్, భూమేశ్ తదితరులు పాల్గొన్నారు.
