అక్రిడేషన్ కార్డుల సమస్యలను పరిష్కరిస్తాం..

అక్రిడేషన్ కార్డుల సమస్యలను పరిష్కరిస్తాం..

యూనియన్ల ప్రతిపాదన మేరకే అక్రిడేషన్ కమిటీలు
వెబ్ సైట్ సమస్యలు పరిష్కరిస్తాం
రామ్ నారాయణ కు హామీ ఇచ్చిన మంత్రి పొంగులేటి
సమస్యలు పరిష్కరించాలని కోరిన టి యు డబ్ల్యూ జే ఐ జే యు బృందం
కేబుల్ చానల్స్, చిన్న పత్రికలకు కూడా అక్రిడేషన్లు కల్పించాలని విజ్ఞప్తి

ఖమ్మం, ఆంధ్ర ప్రభ: జర్నలిస్టు యూనియన్ల ప్రతిపాదన మేరకే అక్రిడేషన్ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాలు, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం ఖమ్మంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో జర్నలిస్టుల అక్రిడేషన్, వెబ్ సైట్, కేబుల్ చానల్స్, చిన్న పత్రికల సమస్యలపై మంత్రి పొంగులేటి కి టియుడబ్ల్యూజే ఐజేయు జర్నలిస్టు యూనియన్ నాయకుల బృందం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే రామ్ నారాయణ సారధ్యంలో ప్రత్యేకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.

యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోల రామ్ నారాయణ ఈ సందర్భంగా మంత్రికి అన్ని విభాగాల జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. రాష్ట్రంలో 44709 మంది జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇస్తామని చెప్పారని, తమరు ఇచ్చిన జీవో ప్రకారం చూస్తే 50% కార్డులు కూడా రావనే గందరగోళం జర్నలిస్టుల్లో నెలకొందని పేర్కొన్నారు. ఫ్రీలాన్సర్, వెటరన్ జర్నలిస్టులకు పెట్టిన నిబంధనలు ఇబ్బందిగా ఉన్నాయని, వెబ్ సైట్ ఓపెన్ చేస్తే అందులో అడిగే ప్రశ్నలు కార్డులు ఇచ్చేలా లేవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు మంత్రి దృష్టికి తెచ్చారు.

వెబ్సైట్ ఫార్మేట్ సులభతరంగా లేదని ప్రస్తావించారు. జిల్లా అక్రిడేషన్ కమిటీలలో గత సాంప్రదాయం ప్రకారం రిజిస్టర్డ్ యూనియన్ నుంచి లెటర్ పంపితే కమిషనర్ కార్యాలయం ఆమోదించి వారిని కమిటీ లో సభ్యులుగా తీసుకున్నారని, ప్రస్తుతం దానిని పక్కన పెట్టి కలెక్టర్లకు అధికారం కల్పించడానినీ తప్పు పట్టారు. ఇది అత్యంత విచారకరమన్నారు. పాత పద్ధతినే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుత జీవో ప్రకారం కలెక్టర్ అందరిని నామినేట్ చేస్తారనే ఉందని , ఇది సాధ్యం కాదని, కలెక్టర్కు కొత్త చిక్కులు తెచ్చి పెడుతుందని పేర్కొన్నారు. మా విన్నపాన్ని పరిశీలించి గతంలో అక్రిడేషన్ కమిటీలు ఏ విధంగా ఏర్పాటు చేశారో అదే సాంప్రదాయాన్ని కొనసాగించాలని రామ్ నారాయణ మంత్రిని కోరారు. జీవో ప్రకారం పెద్ద పత్రికలు, శాటిలైట్ చానల్స్, డెస్క్ జర్నలిస్టుల కార్డులు తగ్గించడం జరిగిందని, దీంతో ఇబ్బందులు తప్పవనే ఆందోళనతో జర్నలిస్టులు ఉన్నారని పేర్కొన్నారు.

చిన్న పత్రికల వారు కూడా తమకు గతంలో మాదిరిగా కార్డులు రావని ఆందోళనలో ఉన్నారని, కేబుల్ చానల్స్ జర్నలిస్టులకు అన్యాయమే జరుగుతుందని వివరించారు. గతంలో వారు కార్డులు పొందినప్పటికీ , ఈసారి కార్డులు రావని ఆందోళన చెందుతున్నారని 20 నిమిషాల పాటు అన్ని అంశాలపై మంత్రికి వివరించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. యూనియన్ల ప్రతిపాదన మేరకే అక్రిడేషన్ కమిటీలు ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు.

అక్రిడేషన్ వెబ్ సైట్ ను సరళీకరణ చేస్తామన్నారు. అక్రిడేషన్ల గడువు మరో నెల పొడిగింపు జరుగుతుందని, జర్నలిస్టులు, సంఘాల నాయకులు ఆందోళన చెందరాదన్నారు. అర్హులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

మంత్రిని కలిసిన వారిలో టీయూడబ్ల్యూజే ఐజేయు జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు మాటేటి వేణుగోపాల్, మాజీ జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు, యూనియన్ జిల్లా కార్యదర్శి మైస పాపారావు, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు మామిడాల భూపాల్, జర్నలిస్టుల జిల్లా హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు కనకం సైదులు, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు మోయినుద్దీన్, జిల్లా కోశాధికారి నాగండ్ల శివ, ఖమ్మం నగర కమిటీ అధ్యక్ష కార్యదర్శులు చెరుకుపల్లి శ్రీనివాస్, నంచర్ల జనార్ధన చారి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ వేగినాటి మాధవరావు, జిల్లా నాయకులు ఏలూరు వేణుగోపాలరావు తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.

Leave a Reply