Hyderabad | చార్మినార్ వద్ద స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రచారం..

Hyderabad | చార్మినార్ వద్ద స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రచారం..
Hyderabad సిటీ బ్యూరో, ఆంధ్రప్రభ : జీహెచ్ఎంసీ స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా నగరంలో అవగాహన కార్యక్రమాలు ఉత్సాహంగా కొనసాగాయి. చారిత్రాత్మక కట్టడం చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో యువత, వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేస్ట్ మ్యాటర్స్, జాయిన్ ద వేస్ట్ వైజ్ రెవల్యూషన్ అంటూ హ్యాష్ ట్యాగ్ లతో, నినాదాలతో చెత్త వర్గీకరణ, రీసైక్లింగ్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. రీ సైకిల్ అండ్ రిపీట్ – లవ్ జీహెచ్ఎంసీ, సార్ట్ ఇట్ రైట్ – కీప్ ఇట్ బ్రైట్ వంటి సందేశాలతో ఏర్పాటు చేసిన ఫోటో ఫ్రేమ్‌ల వద్ద యువతతో పాటు జీహెచ్ఎంసీ ఎస్ బీ ఎం టీమ్ మెంబర్లు సెల్ఫీలు తీసుకుంటూ ప్రచారానికి మద్దతు తెలిపారు.
పసుపు రంగు టీ-షర్టులు ధరించి తడి, పొడి చెత్త వేరు చేయడం ఎంత ముఖ్యమో వివరించారు. ఇంటింటి చెత్త సేకరణలో ప్రజలు సహకరించాలని, చెత్తను మూలంలోనే వర్గీకరించడం ద్వారా నగరం పరిశుభ్రంగా ఉంచవచ్చని సూచించారు. జీహెచ్‌ఎంసీ అధికారులు స్వచ్ఛ సర్వేక్షణలో మెరుగైన ర్యాంకు సాధించాలంటే ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. చార్మినార్ వంటి ప్రాముఖ్య ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఈ అవగాహన కార్యక్రమాలకు నగర ప్రజల్లో మంచి స్పందన వస్తుంది.

