పేదల సొంతింటి కల సాకారం..

నాగర్ కర్నూల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ ; నాగర్ కర్నూల్ మండలంలోని శ్రీపురం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను నేడు నాగర్ కర్నూల్ శాసనసభ్యులు కుచ్చుకుళ్ల రాజేష్ రెడ్డి గారు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లబ్ధిదారులతో మాట్లాడి, ప్రభుత్వం పేదల గృహావసరాలను తీర్చేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. ప్రతి అర్హుడికి గౌరవప్రదమైన నివాసం కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల ద్వారా అనేక కుటుంబాలు సొంత ఇంటి కలను సాకారం చేసుకున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే గ్రామ అభివృద్ధికి అవసరమైన రహదారులు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను కూడా దశలవారీగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించే దిశగా పనిచేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గీతా నరసింహ రెడ్డి ,స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, గ్రామ పెద్దలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave a Reply