నూతన పార్కు నిర్మాణ పనులకు శంకుస్థాపన..

ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : నల్లగొండ కార్పొరేషన్ ను అన్ని రంగాలలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం ఆయన నల్లగొండ కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్ శివాజీ నగర్, 41 వ డివిజన్ పద్మావతి కాలనీలలో నూతన పార్కు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో అండర్ గ్రౌండ్, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ప్రకాశం బజార్ లో ప్రజల రద్దీ దృష్ట్యా రోడ్డు ఆక్రమణలను తొలగించి ఫుట్పాత్ వ్యాపారులకు పాత కలెక్టరేట్ భవనంలో దుకాణాలను కేటాయిస్తున్నట్లు చెప్పారు.
నల్లగొండ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి కి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కోరారు. అనంతరం ఆయన ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ బి చంద్రశేఖర్, ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఎండి అష్రఫ్ అలీ మహమ్మద్, 38 వ డివిజన్ కార్పొరేటర్ దాసరి సాయికుమార్, 39 వ డివిజన్ కార్పొరేటర్ బోయినపల్లి వేదశ్రీ, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
