Collector | వేగంగా ఆహార శుద్ధి యూనిట్లు ఏర్పాటు చేయాలి…

Collector | వేగంగా ఆహార శుద్ధి యూనిట్లు ఏర్పాటు చేయాలి…
జిల్లాలో ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటును వేగవంతం చేయాలి.
బ్యాంకు పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి:
జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి.
Collector | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభః జిల్లాలో ఆహార శుద్ధి (ఫుడ్ ప్రాసెసింగ్) యూనిట్ల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై ఏపిఎమ్ఐపి, డిఆర్డిఏ, బ్యాంకు అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ (PMFME) పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో 156 యూనిట్ల ఏర్పాటును లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు. ఇప్పటివరకు 77 యూనిట్లు గ్రౌండింగ్ అయినట్లు వెల్లడించారు. బ్యాంకుల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి, అర్హత ప్రమాణాలు పూర్తి చేసిన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఎల్‌డిఎం)ను ఆదేశించారు. అర్హులైన వారికి యూనిట్ల మంజూరులో జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు.
గ్రౌండ్ అయిన ప్రతి యూనిట్‌కు సంబంధించి తప్పనిసరిగా ఫోటోలు తీసి సంబంధిత పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఏపిఎమ్ఐపి, డిఆర్డిఏ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ యూనిట్ల ఏర్పాటులో తలెత్తే సాంకేతిక ఇబ్బందులను గుర్తించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ఏపిఎమ్ఐపి పిడి, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఈడీ శ్రీనివాసులు, డిఆర్డిఏ పిడి రమణారెడ్డి, ఎల్‌డిఎం రామచంద్రరావు, బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
