Brahmotsavams | శ్రీ బుగ్గ రాజరాజేశ్వర ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు..

Brahmotsavams | శ్రీ బుగ్గ రాజరాజేశ్వర ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు..
ముక్కంటిని ముద్దాడుతున్న గంగమ్మ..
బుగ్గ’ రాజేశ్వరుని చెంత ప్రకృతి పరవశం
కన్నాల క్షేత్రంలో నిరంతర జలాభిషేకం..
మూడు కొండల మధ్య కొలువైన గౌరీపతి
రేపటి నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు..
భక్తులతో పోటెత్తనున్న కన్నాల అరణ్యం
Brahmotsavams | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : ఆ భోళాశంకరుడు అభిషేక ప్రియుడు. భక్తులు భక్తితో సమర్పించే గుక్కెడు నీటికే మురిసిపోయే ముక్కంటిని.. ప్రకృతి తన ఒడిలో లాలీపాట పాడుతూ నిత్యం అభిషేకిస్తోంది. కాలాలు మారినా, రుతువులు కరిగినా ఆ నీలకంఠుని సేవలో గంగామాత ఏకధారగా నిమగ్నమై ఉంది. ఈ అద్భుత దృశ్యం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ శివార్లలోని మహిమాన్విత పుణ్యక్షేత్రం శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సాక్షాత్కరిస్తోంది.
అలనాటి తపస్సు.. అరణ్యంలో వెలసిన శివుడు!
పురాణం ప్రకారం.. సుమారు రెండు వేల ఏళ్ల క్రితం చిత్రకోట పర్వతం నుంచి వలస వచ్చిన యతీశ్వరులు, నాగసాధువులు ఈ దట్టమైన అరణ్యంలో శివుని సాక్షాత్కారం కోసం ఘోర తపస్సు చేశారు. వారు నిత్యం కాశీకి వెళ్లి గడియలో తిరిగి వచ్చే దివ్యశక్తి కలవారు. ఒకానొక శివరాత్రి నాడు వారు కాశీకి వెళ్లలేని స్థితిలో విచారిస్తుండగా.. పరమశివుడు వారికి స్వప్న దర్శనమిచ్చాడు. తాను సమీపంలోని మూడు కొండల మధ్య వెలుస్తున్నానని సెలవిచ్చాడు. మరుసటి రోజు సాధువులు లేచి చూడగా.. తూర్పు, ఉత్తర, పశ్చిమ కొండల నడుమ లింగరూపంలో పార్వతీ సమేతుడై ఆ శంభుడు దర్శనమిచ్చాడు. నాటి నుంచి నేటి వరకు ఈ క్షేత్రం భక్తజన హృదయాలలో కొలువై ఉంది.
స్వయంగా అభిషేకిస్తున్న గంగాదేవి..
సాధారణంగా శివాలయాల్లో గర్భగుడిలో నీటి కుండను ఏర్పాటు చేసి శివలింగానికి అభిషేకం చేస్తారు. కానీ, ఇక్కడ మాత్రం ప్రకృతి సిద్ధంగా ఉత్తర కొండలో ఉద్భవిస్తున్న నీటి ఊట (బుగ్గ) నిరంతరం శివలింగాన్ని అభిషేకిస్తూ ఉంటుంది. గంగాదేవి శివుని ఆజ్ఞ మేరకు ఇక్కడ వెలసిందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ పవిత్ర జలం గర్భగుడి నుంచి దక్షిణ దిశగా ఉన్న కోనేరులోకి చేరుతుంది. ఈ కోనేటిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
రేపటి నుంచి ఘనంగా జరుగనున్న శివరాత్రి ఉత్సవాలు..
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం నుంచే బ్రహ్మోత్సవాలు, జాతర అత్యంత వైభవంగా ప్రారంభ: కానుంది. తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా సుమారు మూడు లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. “ఉత్తరాన ఉన్న నీటి ఊట ద్వారా స్వామివారికి నిత్యం జలాభిషేకం జరుగుతుంది. నిత్యం వందలాది భక్తులు స్వామిని దర్శించుకుని పునీతులవుతుంటారు” అని ఆలయ పూజారి తెలిపారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.


