Artificial intelligence|భారత్ స్వదేశీ ఏఐ…

- ‘సర్వం ఏఐ’ని రూపొందిస్తున్న ఇండియా
- ప్రపంచ దేశాలకు పోటీగా భారత్ స్వదేశీ ఏఐ
- ఏఐ తయారీలో ముందున్న అమెరికా, చైనా, యూరప్ దేశాలు
- దేశాల మధ్య పోటీగా మారిన ఏఐ
- డిజిటల్ ప్రపంచంపై ఆధిపత్యం కోసం ప్రయత్నం
Artificial intelligence | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఏఐ అంటే విదేశాలవి మాత్రమేనా.. మనం తయారు చేసి చూపించలేమా? టెక్నాలజీ అంటే అమెరికా, యూరప్, చైనాలకు మాత్రమే సాధ్యమా? ఛాట్ జీపీటీ, గ్రోక్, జెమినై ఇలాంటివాటిని మనం సాధించలేమా? అంటే కచ్చితంగా సాధించగలమనే చెప్పాలి. ప్రస్తుతం మన ఇండియాలోనూ ఓ ఏఐ చాట్ బాట్ ఉంది. దానిపేరే సర్వం ఏఐ. ఒకప్పుడు దీన్ని విమర్శించిన టెకీలే ఇప్పుడు దీన్ని వేనోళ్లా పొగుడుతున్నారు. ఇది ఇప్పుడు అద్భుతాలు చేసి చూపిస్తోంది. కొన్ని విషయాల్లో అయితే చాట్ జీపీటీ, జెమినై నే మించిపోతోందంటే అర్థం చేసుకోవచ్చు. తాజాగా కేంద్ర ఐటీ శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా దీన్ని కొనియాడుతూ ట్వీట్ చేశారు. మరి అసలు ఈ సర్వం ఏఐ ఎలా పనిచేస్తోంది? ఇది ఏయే విషయాల్లో చాట్ జీపీటీని మించిపోయింది? ఫ్యూచర్లో దీన్ని ఏ స్థాయికి తీసుకువెళ్లవచ్చు? దీనివల్ల మన దేశానికి కలిగే ప్రయోజనమేంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం ప్రపంచమంతా ఏఐవైపునకు పరిగెడుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది దేశాల మధ్య శక్తి పోరాటంగా మారింది. ఎవరు హైటెక్నాలజీ ఏఐని తయారు చేస్తారు? ఎవరి కంట్రోల్ లో ఫ్యూచర్ డిజిటల్ ప్రపంచం ఉంటుంది? అన్న ప్రశ్నల చుట్టూ ప్రపంచ శక్తులు పోటీ పడుతున్నాయి. అమెరికా, చైనా, యూరప్ దేశాలు ఈ ఏఐ తయారీలో ముందుకు సాగుతున్నాయి. తాజాగా సర్వం ఏఐ మోడల్ తో భారత్ కూడా ఈ పోటీలో తనదైన పంథాను ఎంచుకుంది. ఈ రేసులో ఇప్పుడు భారత్ కూడా ఎంటర్ అయింది. భారత్ ఇప్పుడే పూర్తి స్థాయి ఏఐ శక్తిగా ఎదగకపోయినా, వేగంగా ముందుకు సాగుతోంది. స్టాన్‌ఫర్డ్ గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ ర్యాంకింగ్స్ ప్రకారం అమెరికా, చైనా తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. ఏఐని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం, భారతీయ భాషలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం, సామాజిక సమస్యలకు పరిష్కారాలు, 22 షెడ్యూల్ భాషలను ఉపయోగించేలా ప్రయత్నించడం, విదేశీ ఏఐపై ఆధారపడడాన్ని తగ్గించడం, దేశీయ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం వంటి లక్ష్యలతో భారత్ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే సర్వం ఏఐ ప్రారంభమయింది. భారతీయ అవసరాలకు పూర్తిగా సరిపోయే ఏఐగా ఇది రూపొందుతోంది.

ఈ సర్వం ఏఐ ఇప్పుడు ప్రపంచ మోడల్ లతో పోటీపడుతోంది. ఇది 22 భారతీయ భాషల్లోని డాక్యుమెంట్లను చదవగలదు. సరిగ్గా లేని స్కాన్ కాపీలు లేదా చేతిరాతతో ఉన్న పేపర్లను కూడా 84.3 శాతం కచ్చితత్వంతో గుర్తించి చదువుతుంది. ప్రపంచ స్థాయి AI మోడల్స్ కూడా ఇండియన్ లాంగ్వేజ్ విషయంలో ఇంత ఖచ్చితత్వాన్ని చూపలేకపోయాయి. సాధారణంగా గూగుల్ లేదా చాట్‌జిపిటి వంటి కంపెనీలు ఇంగ్లీష్‌పై ఎక్కువ దృష్టి పెడతాయి. భారతీయ భాషల ప్రాముఖ్యత వాటికి తక్కువ. కానీ.. సర్వం AI మన భాషల్లోని స్క్రిప్టుల్లో తేడాలను కనిపెట్టి మరీ పని చేసేలా మోడల్స్‌ను తయారు చేసింది. అంతేకాకుండా ఏఐ లాంగ్వేజ్ అయిన బుల్ బుల్ V3 లోనూ సమర్థవంతంగా పనిచేస్తోంది. ఇది టెక్స్ట్-టు-స్పీచ్ మోడల్. అంటే రాసిన దానిని మాటలుగా మార్చడం. 11 భారతీయ భాషల్లో మనుషులు మాట్లాడినట్లే చాలా సహజంగా, తప్పులు లేకుండా మాట్లాడుతుంది. ఒక సర్వేలో 20 వేల మంది దీనికి ఓటు వేసి, గూగుల్ జెమిని కంటే ఇదే బాగుందని తేల్చారు.

ఈ ఏఐ ని 2023లో ప్రత్యూష్ కుమార్, వివేక్ రాఘవన్ బెంగళూరులో స్థాపించారు. సుమారు 53 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 440 కోట్లు నిధులను సేకరించారు. భారత ప్రభుత్వం వీరికి అవసరమైన సూపర్ కంప్యూటింగ్ GPU సౌకర్యాలను కల్పించి అండగా నిలిచింది. అప్పటినుంచి తన పనిని మొదలుపెట్టింది. అయితే మొదట్లో చాలామంది దీన్ని తిట్టిపోశారు. అసలు ఇది వేస్ట్ అనీ.. ప్రపంచంలో ఇప్పటికే ఏఐ చాలా డెవలప్ అయినా.. ఇది మాత్రం వెనుకబడి ఉందని అన్నారు. టెక్ క్రిటిక్స్ కూడా ఇదే చెప్పారు. అయినా సర్వం ఏఐ వెనక్కి తగ్గలేదు. తక్కువ వనరులతోనే మెల్లిగా వృద్ది చెందింది. మూడేళ్లు తిరిగే సరికి ప్రపంచ ఏఐతో పోటీపడే స్థాయికి చేరుకుంది. ఏకంగా కేంద్ర ఐటీ శాఖామంత్రి సైతం దీన్ని కొనియాడుతూ ట్వీట్ చేశారు. దీంతో ఏ రంగంలోనైనా పట్టుదల ఉంటే ప్రపంచ స్థాయి సంస్థలను కూడా మన దేశ స్టార్టప్‌లు మించిపోగలవని సర్వం AI నిరూపించింది. ఇది కేవలం టెక్నాలజీ విజయం మాత్రమే కాదు, డిజిటల్ రంగంలో భారతదేశం సాధించిన ఆత్మనిర్భరతకు ప్రతీక అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఇది లాంగ్వేజ్ ఏఐగా బాగా వృద్ది చెందింది. భవిష్యత్తులో మెల్లిగా అన్ని రంగాలకు అంటే.. మెటీరియల్ సైన్స్, హెల్త్‌కేర్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో కూడా విప్లవాత్మక AI మోడళ్లను సిద్ధం చేస్తున్నారని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇవి త్వరలోనే ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించనున్నాయని చెప్పారు. తక్కువ ఖర్చుతో, సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా రూపొందించిన సర్వం AI వెబ్‌సైట్, దాని పనితీరు, భారతీయ టెక్ పరిశ్రమ ఏ స్థాయికి చేరుకుందో చాటిచెబుతోంది.

ప్రస్తుత ప్రపంచాన్ని ఏఐనే నడిపిస్తోంది. ఉద్యోగాలు.. వర్క్ విషయాలన్నిటిలోనూ ఏఐ ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ సమయంలో మన దేశానికి సొంత ఏఐ ఉండాల్సిన అవసరం ఉంది. డిజిటల్ వార్ ఫేర్ లో ఇది చాలా ముఖ్యం. చైనా గురించి అందరికీ బాగా తెలుసు. ఆ దేశం మనపై ఎప్పటికప్పుడు స్పై చేస్తుంది. తన దేశ యాప్స్ ను మన దేశంలో ఎవరైతే ఉపయోగిస్తున్నారో.. వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుంది. ఆ తర్వాత దీన్ని యూజ్ చేసుకుని సైబర్ వార్ కు దిగుతుంది. అంతెందుకు 1999 కార్గిల్ వార్ సమయంలో అమెరికా మనకు జీపీఎస్ యాక్సెన్ ను ఇవ్వలేదు. దీంతో మన ఎయిర్ ఫోర్స్, నేవీ యుద్దంలో సరిగ్గా పాల్గొనలేకపోయాయి. తద్వారా మనం పూర్తిగా పదాతిదళాలపైనే డిపెండ్ కావాల్సి వచ్చింది. యుద్దంలో మనం గెలిచినప్పటికీ.. ఈ ప్రమాదం భవిష్యత్తులో ఉంటుందని గుర్తించి సొంత ఏఐ అయిన నావిక్ ను తయారు చేసుకున్నాం. ఇప్పుడు టెక్నాలజీ యుగం కాబట్టి డేటా చాలా కీలకం. దీన్ని చైనా రహస్యంగా సేకరిస్తుందన్న కారణంతోనే 2020 గల్వాన్ ఘటన తర్వాత మన దేశంలో అనేక యాప్స్ ను నిషేధించారు. దీనికి ప్రధాన కారణం డేటా చోరీనే అని చెప్పుకోవచ్చు. సో.. ఒక్క చైనానే కాదు.. అమెరికా, యూరప్ దేశాలన్నీ యుద్దమే గనుక వస్తే ఇదే చేస్తాయి. అందుకే మన దేశంలోని డేటాను కాపాడుకోవాలి. ఇందుకసం సొంత టెక్నాలజీ అవసరం అవుతుంది. ఏఐ నుంచి మరింత ఎక్కువ సమాచారాన్నే పొందవచ్చు కాబట్టి.. ఈ మోడల్ ను సొంతంగా తయారు చేసుకోవాలి. అందుకే మన దేశం వీటిపై దృష్టి సారిస్తోంది.

సో.. మీరుకూడా వీలైనంత ఎక్కువగా ఇండియన్ ఏఐ ని యూజ్ చేసుకోండి. అంతేకాకుండా.. వాట్సాప్ ను వదిలేసి అరట్టై వంటి యాప్స్ ను ఉపయోగించండి. అప్పుడే మన దేశం టెక్నాలజీలో ముందుకు సాగుతుంది. డేటా విషయంలో చైనా అడ్వాన్స్డ్ ఉండటానికి కారణం ఇదే. ఆ దేశంలో విదేశీ యాప్స్ ఎవరూ ఉపయోగించరు. అన్నీ స్వదేశీ యాప్స్ మాత్రమే ఉపయోగిస్తారు. అందుకే డేటా మొత్తం తమ దేశం దాటకుండా ఉండటమే కాకుండా.. దీన్ని యూజ్ చేసుకుని ఏఐని డెవలప్ చేయడం కూడా సులభం అవుతుంది. అందువల్లే మనమూ ఇలా దేశ అభివృద్దికి సహాయపడాలంటే భారత టెక్నాలజీని వీలైనంత ఎక్కువగా ఉపయోగించండి.
