Muncipal ఎగ్జిట్ పోల్స్ తీర్పు..?

  • కాంగ్రెస్‌కు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్
  • మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ స‌త్తా
  • దాదాపు 70 నుంచి 85 మున్సిపాలిటీలు గెలుచుకునే అవ‌కాశం
  • బీఆర్ఎస్, బీజేపీలు చాలా వెనుకబడి ఉన్నాయని తేల్చిన సర్వేలు
  • ఫిబ్రవరి 13న వెలువడనున్న అధికారిక ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ

కాంగ్రెస్ స‌త్తా..
తెలంగాణలో మున్సిప‌ల్ పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీ స‌త్తా చాటుతుంద‌ని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌కు ఈ ఎన్నికల్లో నిరాశ త‌ప్ప‌ద‌ని తెలిపింది. అధిక శాతం స్థానాల్లో హ‌స్తం హ‌వా కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నిండ‌గా.. గులాబీ దండులో నిరాశ అలుముకుంది.

సర్వేలన్నీ కాంగ్రెస్‌కే పట్టం
రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఈ ఎన్నికల పోలింగ్ అనంతరం విడుదలైన సర్వేలన్నీ కాంగ్రెస్‌కే పట్టం కట్టాయి. ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు ఓటర్లను ఆకట్టుకోవడంలో విఫలమైనట్లు ఈ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో జ‌రిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించనుందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ
వివిధ సర్వే సంస్థల అంచనాలను పరిశీలిస్తే, కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ దిశగా పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్ 68 నుంచి 76 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటుందని వెల్లడించగా, బీకాన్ సర్వే ఏకంగా 80-85 పీఠాలు గెలుచుకుంటుందని పేర్కొంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ 8 నుంచి 36 స్థానాలకు, బీజేపీ 3 నుంచి 6 స్థానాలకు పరిమితం కావచ్చని ఈ సర్వేలు అంచనా వేశాయి.

వార్డుల వారీగా చూస్తే…
వార్డుల వారీగా చూస్తే, ఆపరేషన్ చాణక్య సర్వే మరింత లోతైన విశ్లేషణ అందించింది. మొత్తం మున్సిపల్ వార్డుల్లో కాంగ్రెస్‌కు 1400-1449 వార్డులు (48% ఓట్లు), బీఆర్ఎస్‌కు 745-793 వార్డులు (26% ఓట్లు), బీజేపీకి 358-399 వార్డులు (13% ఓట్లు) దక్కే అవకాశం ఉందని తెలిపింది. ఆశ్చర్యకరంగా జనసేన పార్టీ 30-35 వార్డులు గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొనడం గమనార్హం.

ఇక 7 మున్సిపల్ కార్పొరేషన్లలోనూ కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలో బీజేపీ ఆధిక్యం ప్రదర్శించవచ్చని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. మహబూబ్‌నగర్, మంచిర్యాల, రామగుండం, నల్గొండ కార్పొరేషన్లలో కాంగ్రెస్ ఏకపక్ష విజయం సాధిస్తుందని తెలిపింది. కొత్తగూడెంలో కాంగ్రెస్‌కు, సీపీఐకి మధ్య గట్టిపోటీ ఉండగా, బీఆర్ఎస్ మూడో స్థానానికే పరిమితం కావచ్చని సర్వేలు చెబుతున్నాయి. సామాజిక వర్గాల వారీగా ఎస్సీ, ముస్లిం మైనారిటీ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

Leave a Reply