18వ డివిజన్‌లో కాంగ్రెస్ జోరు…

అభివృద్ధి అజెండాతో దూసుకుపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి జాజిమొగ్గ నరసింహులు

మహబూబ్ నగర్, ఫిబ్రవరి (ఆంధ్రప్రభ):

మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జాజిమొగ్గ నరసింహులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. డివిజన్ పరిధిలోని కాలనీలన్నింటిలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. గతంలో కౌన్సిలర్‌గా పనిచేసిన సమయంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందించిన సేవలే ఆయనకు బలంగా మారాయి. తాగునీరు, రహదారులు, కాలువలు, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేసిన నరసింహులు, ఈసారి మరింత సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రజల ఆశీర్వాదం కోరుతున్నారు.
ప్రచారంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ, డివిజన్ అభివృద్ధికి తన ప్రణాళికలను వివరించడంతో పాటు ప్రజల సూచనలు స్వీకరిస్తున్నారు. గత దశాబ్దాలుగా ప్రజాసేవలో కొనసాగుతున్న తన ప్రయాణాన్ని మరింత బలపరచేందుకు ఈ ఎన్నికలు కీలకమని ఆయన పేర్కొంటున్నారు. మరోసారి గెలిపిస్తే స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సహకారంతో డివిజన్‌ను అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్తానని హామీ ఇస్తున్నారు.
డివిజన్ పరిధిలోని పలు కాలనీల ప్రజలు కూడా జాజిమొగ్గ నరసింహులుపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చేసిన అభివృద్ధి పనులను గుర్తుచేసుకుంటూ, ఈసారి కూడా ఆయన విజయం తధ్యమని స్థానికులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. డివిజన్‌లో మిగిలి ఉన్న మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించేందుకు నరసింహులును మరోసారి గెలిపించుకోవాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం 18వ డివిజన్‌లో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా ప్రచారం నిర్వహిస్తుండగా, జాజిమొగ్గ నరసింహులుకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఎన్నికల నేపథ్యంలో డివిజన్‌లో రాజకీయ వాతావరణం హీటెక్కగా, నరసింహుల ప్రచారం రోజురోజుకూ ఊపందుకుంటోంది.

Leave a Reply