AP | సుస్థిర సహజ వనరుల నిర్వహణయే…..

AP | సుస్థిర సహజ వనరుల నిర్వహణయే…..
వాటర్‌షెడ్ అభివృద్ధి ద్వారా గ్రామీణ జీవనోపాధుల బలోపేతం
AP | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : సుస్థిర సహజ వనరుల నిర్వహణతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సమగ్ర జీవనోపాధుల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా నాబార్డు ఆర్థిక సహకారంతో, ఎస్‌ఆర్‌ఈడీ సంస్థ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. శుక్రవారం ప్యాపిలి మండలం ఎస్. రంగాపురం గ్రామంలో చేపట్టనున్న వాటర్‌షెడ్ ప్రాజెక్టు పనులకు సంబంధించి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో డోన్ శాసనసభ్యులు జయసూర్యప్రకాశ్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. డీడీఎం నాబార్డు కే.ఆర్.డి. కార్తీక్, ఎస్‌ఆర్‌ఈడీ ఎన్‌జీవో అధ్యక్షులు దామోదర్ రెడ్డి, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రవీంద్ర కుమార్, జిల్లా ఉద్యానవన అధికారి నాగరాజు, డ్వామా పీడీ సూర్యనారాయణ, డీఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భూమి పూజ అనంతరం శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్, డీడీఎం నాబార్డు కలిసి ప్రాజెక్టు పరిధిలోని సీబీపీ రిడ్జ్ ప్రాంతంలో చేపట్టనున్న వాటర్‌షెడ్ పనులను జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు. ఈ పనుల ద్వారా మట్టి సంరక్షణ, నీటి నిల్వ సామర్థ్య పెంపు, భూసార అభివృద్ధికి సంబంధించిన క్షేత్రస్థాయి చర్యలకు శ్రీకారం చుట్టినట్లయిందని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసి, విద్యకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. జీవనోపాధి మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా, ఉద్యానవన శాఖతో సమన్వయంతో కలచట్ల వాటర్‌షెడ్ లబ్ధిదారులకు ఎలక్ట్రిక్ కూరగాయల విక్రయ యంత్రాలను పంపిణీ చేశారు . ఇవి విలువ ఆధారిత వ్యాపారాన్ని ప్రోత్సహించడంతో పాటు, శుభ్రమైన శక్తి వినియోగం ద్వారా చిన్న వ్యాపారులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పిస్తాయన్నారు. నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంపొందించి, వాతావరణ మార్పులకు అనుగుణమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు డ్రిప్ ఇరిగేషన్ కిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశామని కలెక్టర్ తెలిపారు. దీని వల్ల సాగునీటి సమర్థ వినియోగంతో పాటు పంట దిగుబడులు మెరుగుపడనున్నాయని అన్నారు. అదేవిధంగా సౌరశక్తితో పనిచేసే ఆటోమేటిక్ బయో-రిసోర్స్ సెంటర్‌ను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొబైల్ డ్రిప్ ఇరిగేషన్ విధానం, డ్రోన్ ద్వారా పిచికారీ చేసే విధానాల ప్రదర్శనలు నిర్వహించరు. ఈ కార్యక్రమం వాటర్‌షెడ్ అభివృద్ధి, జీవనోపాధుల మెరుగుదల, సహజ వ్యవసాయం వంటి అంశాలపై అన్ని శాఖల సమన్వయంతో అమలవుతుందని కలెక్టర్ అన్నారు.
