Vaibhav | ఫైనల్‌లో భారత్ భారీ స్కోర్

Vaibhav | ఫైనల్‌లో భారత్ భారీ స్కోర్
Vaibhav | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ లో యువ భారత్ 411 పరుగుల భారీ స్కోర్ చేసింది. హరారే వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తుదిపోరులో టీమిండియా యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ(175) చెలరేగి ఆడాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన భారత్ 411 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లీష్ జట్టు ముందు 412 పరుగుల భారీ టార్గెట్ ఉంది.
సూర్యవంశీ తన తుపాను ఇన్నింగ్స్‌లో కేవలం 80 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు, 15 భారీ సిక్సర్లతో ఏకంగా 175 పరుగులు చేశాడు. 218.75 స్ట్రైక్ రేట్‌తో అతను చూపించిన విశ్వరూపానికి ఇంగ్లండ్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. మైదానం నలువైపులా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరోవైపు, కెప్టెన్ ఆయుష్ మాత్రే (51 బంతుల్లో 53) అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 90 బంతుల్లోనే 142 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత వేదాంత్ త్రివేదితో కలిసి మూడో వికెట్‌కు సూర్యవంశీ 89 పరుగులు జోడించాడు.
మాత్రే, సూర్యవంశీ అవుటయ్యాక కూడా భారత బ్యాటర్లు అదే జోరును కొనసాగించారు. వేదాంత్ త్రివేది (32), విహాన్ మల్హోత్రా (30) ఫర్వాలేదనిపించారు. చివర్లో వికెట్ కీపర్ అభిగ్యాన్ కుందు (31 బంతుల్లో 40), కనిష్క్ చౌహాన్ (20 బంతుల్లో 37 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో భారత స్కోరు 400 పరుగుల మార్కును దాటింది. వీరి ధాటికి భారత జట్టు చివరి 10 ఓవర్లలో వందకు పైగా పరుగులు రాబట్టింది.
