Tiger | తెలుగు రాష్ట్రాల్లో గాండ్రింపులు
Tiger | తెలుగు రాష్ట్రాల్లో గాండ్రింపులు
- ఏపీ, తెలంగాణలో పెద్దపులి సంచారం
- బిక్కుబిక్కుమంటూ జనం..
- పులిని పట్టుకునేందుకు అధికారుల యత్నం
Tiger | వెబ్డెస్క్, ఆంధ్రప్రభ : పెద్దపులి సంచారంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. అడవిని వదిలి జనావాసాల మధ్య తిరుగుతుండటంతో జనం గజగజ వణికిపోతున్నారు. పెద్ద పులి రోజుకో చోట తిరుగుతూ భయాందోళనలకు గురిచేస్తోంది. ఆవులు, దూడలపై దాడి చేస్తుండటంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో గత ఐదు రోజులుగా పెద్దపులి కలకలం సృష్టిస్తోంది. ఇక తెలంగాణాలోనూ పెద్దపులి సంచారంతో ప్రజలు వణికిపోతున్నారు. పులి కదలికలపై స్పష్టత లేకపోవడంతో ప్రజలు రాత్రిళ్లు నిద్రాహారాలు మానుకుని బిక్కుబిక్కుమని గడుపుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో పెద్దపులి సంచరిస్తుందని తెలుసుకొని ప్రజలు బయట తిరగాలంటే భయపడిపోతున్నారు. యాదాద్రి, జనగామ జిల్లాలో పెద్దపులి తిరుగుతుందనే ప్రచారం జరుగుతుండటంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. రెండు రోజుల కిందటి వరకు యాదాద్రి జిల్లాలో సంచరించిన పులి… అక్కడ నుంచి ఇప్పుడు సిద్దిపేట జిల్లా మీదుగా జనగాం జిల్లాలోకి అడుగు పెట్టింది. జనగామ జిల్లా శామీర్‌పేట లోని సుశీలమ్మ వృద్ధాశ్రమం వద్ద పులి సంచరించినట్లు సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డయింది. పులిని పట్టుకోవటం కోసం రంగంలోకి అధికారులు అయితే ఈ పెద్దపులిని పట్టుకోవడం కోసం అటవీ అధికారులు రంగంలోకి దిగారు. యాదాద్రి జిల్లా ఆలేరు మండలం, టంగుటూరు, సారాజిపేటకు చేరుకుని అక్కడ ఒక ఆవు పైన పులి దాడి చేసింది. యాదాద్రి, జనగామ జిల్లాలో సంచరిస్తున్న పులి జాడ తెలుసుకునేందుకు ట్రాప్ కెమెరాలతో పాటు థర్మల్ డ్రోన్లను కూడా రంగంలోకి దించారు. ఈ పులి జాడ తెలుసుకోవడానికి అత్యున్నత స్థాయి సమావేశాన్ని కూడా నిర్వహించి తర్వాత చర్యలను చేపట్టారు. పులి కదలికలను ఎప్పటికప్పుడు మానిటర్ చేయడానికి స్టేట్ లెవెల్లో స్పెషల్ టెక్నికల్ టీం ని కూడా ఏర్పాటు చేశారు .

ఆంధ్రప్రదేశ్‌లో..
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలానికి చెందిన చిడిపి, ఆరుకురేవుల గ్రామాల పరిసర పొలాల్లో పెద్దపులి పాదముద్రలను గ్రామస్థులు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. రెండు రోజుల క్రితం తొర్రేడు ప్రాంతం చుట్టుపక్కల పెద్దపులి కనిపించినట్లు అటవీ శాఖ అధికారులు ధ్రువీకరించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇదే పెద్దపులి సీతానగరం మండలంలోని గోదావరి లంక ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు కూడా అడుగుజాడల ఆధారంగా అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. లంక గ్రామాల్లో పులి సంచారం వార్తలతో ఒక్కసారిగా ఆందోళన వాతావరణం నెలకొంది. పశువుల మేతకు వెళ్లడానికీ, వ్యవసాయ పనులకు వెళ్లడానికీ గ్రామస్థులు భయపడుతున్న పరిస్థితి నెలకొంది.

సీతానగరం నుంచి ప్రారంభమైన పెద్దపులి కదలికలు కోరుకొండ మండలం గాడాల ప్రాంతం వరకు విస్తరించినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో తొర్రేడు వద్ద పశువులపై దాడి జరగడంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల మధ్య రాజమండ్రిలోని దివాన్ చెరువు ప్రాంతంలో కలకలం రేగింది. దివాన్ చెరువు ఎస్‌వీపీసీ ఫంక్షన్ హాల్ సమీపంలో పెద్దపులి సీసీ కెమెరాలకు చిక్కిన దృశ్యాలు బయటకు రావడంతో అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పట్టణ పరిధిలోకి కూడా పెద్దపులి చేరిందన్న వార్తలతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది.
ఈ నేపథ్యంలో జిల్లా అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పులి కదలికలను గుర్తించేందుకు ఆయా ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. గ్రామస్తులు ఒంటరిగా పొలాలకు వెళ్లకుండా గుంపులుగా వెళ్లాలని, అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.

