Collector | పదిలో విజయం మనదే..

Collector | పదిలో విజయం మనదే..

  • స్టేట్ టాపర్ గా రావాలి..
  • ఆత్మ విశ్వాసంతో పరీక్షలు రాయండి
  • వంద రోజుల ప్రణాళిక అందుకోసమే..
  • 10 వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ తమీమ్ అన్సారియా

Collector | గుంటూరు బ్యూరో – ఆంధ్రప్రభ : పది తరగతి పరీక్షల్లో గుంటూరు జిల్లా నుంచి స్టేట్ టాపర్లు రావాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అన్నారు. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల విద్యార్థుల కోసం నిర్వహించిన “విజయం మనదే” కార్యక్రమంలో ఆమె పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ఉత్తేజపురకంగా మాట్లాడారు.

Collector

ఈ కార్యక్రమం ఈ రోజు ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో జరిగింది. జిల్లా నుంచి మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, అందులో భాగంగానే వంద రోజుల ప్రణాళిక చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు పదవ తరగతి కీలకమని, ఈ దశలో ప్రతిభ కనబరచాలని సూచించారు.

భయం వద్దు… ఆత్మవిశ్వాసం అవసరం

Collector

పరీక్షల పట్ల భయం ఉందా అని విద్యార్థులను ప్రశ్నించిన జిల్లా కలెక్టర్, భయం అవసరం లేదని, ఆత్మవిశ్వాసంతో చదివితే తప్పకుండా మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. అయితే అతి ఆత్మవిశ్వాసం కూడా మంచిది కాదని స్పష్టం చేశారు. ప్రతి మార్కు కీలకమేనని, రోజూ రాయడం ద్వారా సాధన పెంచుకోవాలని సూచించారు. చిన్న చిన్న సూచనలు పాటిస్తే స్టేట్ టాపర్‌గా నిలవడం సాధ్యమేనన్నారు.

పెద్ద లక్ష్యం పెట్టుకోవాలి..

Collector

విద్యార్థులను తమ లక్ష్యాల గురించి ప్రశ్నించిన జిల్లా కలెక్టర్, పెద్ద లక్ష్యం పెట్టుకుని దానికి అనుగుణంగా కృషి చేయాలని సూచించారు. చదువు, పరీక్షలు, ఫలితాలపై సానుకూలంగా ఆలోచించే విజువలైజేషన్ టెక్నిక్ ఉపయోగపడుతుందని తెలిపారు. పరీక్షలకు బాగా సిద్ధమవుతున్నాను, మంచి మార్కులు సాధిస్తున్నాను అన్న భావనను మనసులో నిలుపుకోవాలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ఉచిత సౌకర్యాలు, ఒత్తిడి లేని వాతావరణం ఉన్నాయని పేర్కొంటూ, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చదువులో మెరుగైన ఫలితాలు సాధించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

తల్లిదండ్రుల కష్టానికి ఫలితం చూపించాలి…

Collector

తల్లిదండ్రులు గర్వపడే విధంగా విద్యార్థులు తమ జీవితాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు. తల్లిదండ్రులు చేస్తున్న కష్టానికి మంచి ఫలితం చూపించాల్సిన బాధ్యత విద్యార్థులదేనని తెలిపారు.

నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టి…

Collector

ప్రతి రోజు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేయాలని కలెక్టర్ సూచించారు. గ్రోత్ మైండ్ సెట్ కలిగి ఉండాలని, నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగాలని అన్నారు. ఎక్కువ కష్టపడితే భవిష్యత్తులో సౌకర్యవంతమైన జీవితం లభిస్తుందని, ఇప్పుడు సౌకర్యాన్ని కోరుకుంటే తరువాత కష్టాలు తప్పవని వ్యాఖ్యానించారు.

విద్యార్థుల స్పందన..

Collector

జిల్లా కలెక్టర్ ప్రసంగంతో ఉత్తేజితులైన విద్యార్థులు స్టేట్ టాపర్లు అవుతామని, భవిష్యత్తులో కలెక్టర్‌తో అభినందనలు చెప్పించుకుంటామని తెలిపారు. కొందరు విద్యార్థులు ఐ.ఏ.ఎస్‌గా మారడమే తమ లక్ష్యమని చెప్పారు. ఇప్పటి వరకు చిన్న లక్ష్యాలతో ఉన్నామని, ఈ కార్యక్రమం పెద్ద లక్ష్యాలు పెట్టుకునేలా ప్రేరణ ఇచ్చిందని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు పరీక్షలు రాసే విధానంపై పలు సూచనలు చేశారు. జిల్లా విద్యా శాఖ అధికారి డా. షేక్ సలీం భాషాతో పాటు ఇతర విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply