NTR | తెలుగు జాతి ఆత్మగౌరవం
NTR | తెలుగు జాతి ఆత్మగౌరవం
- ఎమ్మెల్యే రవికుమార్
NTR | ఆమదాలవలస, ఆంధ్రప్రభ : ఎన్‌టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఆమదాలవలస శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ఛైర్మన్ కూన రవికుమార్ ఆముదాలవలస పట్టణంలోని బ్రిడ్జ్ జంక్షన్‌లో ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి ఆదివారం పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ మహానటుని, మహానేతను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలుగువాడి ఉనికిని ప్రపంచానికి పరిచయం చేసిన అపూర్వ వ్యక్తిత్వం నందమూరి తారక రామారావుదని కొనియాడారు. నటుడిగా ఆయన వెండితెరపై ఆవిష్కరించిన పాత్రలు కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రను దేశ విదేశాలకు చాటిచెప్పాయని తెలిపారు. శ్రీకృష్ణుడు, రాముడు, కర్ణుడు వంటి పాత్రల ద్వారా తెలుగు వారి మనోభావాలను ప్రతిబింబించిన నట సార్వభౌముడిగా ఎన్‌టీఆర్ చిరస్థాయిగా నిలిచారన్నారు.
అలాగే రాజకీయ రంగంలోకి ప్రవేశించిన తరువాత కూడా ఆయన ప్రజల మనసుల్లో దేవుడిలా నిలిచారని ఎమ్మెల్యే అన్నారు. ప్రజలే దేవుళ్లు – సమాజమే ఆలయం అనే భావనతో పాలన సాగించిన మహానేత ఎన్‌టీఆర్ ని అన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన అనేక విప్లవాత్మక పథకాలు రాష్ట్ర రాజకీయ చరిత్రను మలుపుతిప్పాయని వివరించారు. రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ద్వారా పేదల ఆకలి తీర్చిన మహానుభావుడిగా ఆయనను చరిత్ర స్మరిస్తుందని చెప్పారు.
తెలుగు భాషకు, తెలుగు సంస్కృతికి అధికారిక గుర్తింపు తీసుకురావడంలో ఎన్‌టీఆర్ పాత్ర మరువలేనిదని ఎమ్మెల్యే అన్నారు.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ స్థాయిలో గట్టిగా వినిపించిన తొలి నాయకుడిగా ఆయన ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని తెలిపారు. రాజకీయాల్లో విలువలు, నిబద్ధత, ప్రజల పట్ల బాధ్యత అనే అంశాలను కొత్తగా నిర్వచించిన నాయకుడు ఎన్‌టీఆర్ అని అన్నారు.
ఇప్పటి తరానికి ఎన్‌టీఆర్ జీవితం ఒక స్ఫూర్తిదాయకమైన పాఠమని, ఆయన చూపిన మార్గం నేటి నాయకులకు దిక్సూచిగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. వ్యక్తిగత లాభాలకన్నా ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చిన ఆయన త్యాగస్వభావం ఎప్పటికీ ఆదర్శనీయమని అన్నారు.
తెలుగువారి ఆరాధ్య దైవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ప్రజానాయకుడు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనందరి బాధ్యత అని కూన రవికుమార్ తెలిపారు. ఎన్‌టీఆర్ పేరు తెలుగు జాతి చరిత్రలో సూర్యచంద్రులున్నంతకాలం చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన అన్నారు.
