Hasanparthy | హసన్ పర్తి శివారులో రోడ్డు ప్రమాదం

Hasanparthy | హసన్ పర్తి శివారులో రోడ్డు ప్రమాదం

  • నేషనల్ హైవే నిర్మాణ పనుల టిప్పర్ ఢీ
  • ఈ దుర్ఘటనలో పాల వ్యాపారి కుశుడు మృతి
  • మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా
  • ఎనిమిది నెలల పాపతో రోడ్డెక్కిన కుటుంబ సభ్యులు

Hasanparthy | హసన్ పర్తి, ఆంధ్రఫ్రభ : హన్మకొండ జిల్లా హసన్ పర్తి.. గంటూర్ పల్లికి వెళ్లే రహదారిలో నేషనల్ హైవే రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఇవాళ‌ ఉదయం రోడ్డు నిర్మాణ పనుల టిప్పర్ డ్రైవర్ వేగంగా నడుపుతూ పెంబర్తికి వెళ్తున్న క్రమంలో నిర్మాణ పనులు కొనసాగుతున్న హసన్ పర్తి నేషనల్ హైవే బ్రిడ్జి వద్ద కేశపూర్ నుండి హసన్ పర్తికి వెళ్తున్న మోటార్ వెహికల్ ను ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఒక వ్యక్తి మృతిచెందాడు. మృతదేహం గుర్తుపట్టలేనంతగా నుజ్జునుజ్జుగా మారి కేవలం కాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి.

మృతిచెందిన వ్యక్తి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కేశవపూర్ గ్రామానికి చెందిన పాల వ్యాపారి ఈర కుశుడి(38)గా గుర్తించారు. మృతుడు హసన్ పర్తి, గంటూర్ పల్లి, కేశవపూర్ గ్రామాల ప్రజలకు పాలవ్యాపారిగా సుపరిచితుడు కావడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటన సమాచారంతో కుశుడు కుటుంబ సభ్యులతో పాటు మిత్రులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు రోడ్డెక్కారు. హనుమకొండ కరీంనగర్ ప్రధాన జాతీయ రహదారిలో మృతిచెందిన కుశుడు భార్య స్నేహ తన ఎనిమిది నెలల బిడ్డ, కుమార్తె, కుమారుడిలతో తమకు న్యాయం చేయాలని ధర్నా చేపట్టింది.

దీంతో కేశవాపూర్ కు చెందిన సర్పంచ్ తో పాటు మాజీ ఎంపీటీసీ, స్థానిక ప్రజాప్రతినిధుల, పలు పార్టీల నాయకులు, ప్రజలు ఆమెకు మద్దతుగా ధర్నాలో కూర్చున్నారు. ప్రధాన రహదారిపై రెండు గంటల పాటు ధర్నా కొనసాగింది. ఈధర్నాతో హసన్ పర్తి ఎర్రగట్టు గుట్ట నుండి ఎల్లాపూర్ వరకు మూడు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. జాతీయ రహదారి నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో ప్రధాన రహదారి విషాద భరితంగా, శోకతప్తంగా మారింది. స్థానిక ఎస్సైలు దేవేందర్ రవికుమార్ రవికుమార్లు తమ సిబ్బందితో కలిసి ధర్నా విరమింపజేయాలని ప్రయత్నించారు. న్యాయం జరిగేంత వరకు ధర్నాను విరమించేది లేదని ఆందోళనకారులు మొండికేశారు.

Hasanparthy
  • రంగప్రవేశం చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి…

హనుమకొండ – కరీంనగర్ ప్రధాన రహదారిలో ధర్నా గంటలపాటు కొనసాగడంతో పరిస్థితి విషమించింది. ఈ సంఘటన సమాచారంతో కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తమ పరిధిలోని సీఐలు పుల్యాల కిషన్, సుంకరి రవికుమార్ లతో రంగ ప్రవేశం చేశారు. మృతుడి కుటుంబానికి తగు న్యాయం చేస్తామని, తమపై నమ్మకం ఉంచి ధర్నా విరమించాలని నచ్చజెప్పారు. దీంతో మృతిని కుటుంబ సభ్యులు ఆందోళన విరమించి పోలీసు స్టేషన్ కు తరలివెళ్లారు. మృతునికి భార్య స్నేహతో పాటు ఇద్దరు ఆడపిల్లలు, కుమారుడు ఉన్నారు. టిప్పర్ డ్రైవర్ బీహార్ కు చెందిన సాహిల్ అలామ్ గా గుర్తించారు. మృతుదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎంజీఎంకు తరలించారు. మృతుని కుటుంబానికి న్యాయం జరుగుతుందో.. లేదో.. వేచి చూడాల్సిందే.