800 MW | 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌కు గ్రీన్ సిగ్నల్

800 MW | 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌కు గ్రీన్ సిగ్నల్

800 MW | గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : రామగుండం పారిశ్రామిక నగరంగా మరింత ఎదగబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రామగుండంలో 1×800 మెగావాట్ల విద్యుత్(1×800 megawatts of electricity) ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో స్థానిక ప్రజల్లో ఉత్సాహం నెలకొంది. ఈ ప్రాజెక్టు ద్వారా రామగుండం మరోసారి రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తిలో ప్రధాన కేంద్రంగా నిలవనుంది.

ఇటీవల హైదరాబాదులో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిష్ఠాత్మక నిర్ణయం తీసుకోవడం, రామగుండం ప్రాంతం అభివృద్ధికి పెద్ద ఊతమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రామగుండం శాసనసభ్యుడు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఈ రోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కని, మంత్రివర్యులు డి. శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావుని మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్ఛం అందజేశారు.

ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, “రామగుండం ప్రజల తరఫున ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి, మంత్రివర్గ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. గత రెండేళ్లుగా మేము నిరంతరంగా ఈ ప్రాజెక్టు కోసం కృషి చేశాం. ఆ కృషి ఫలించింది. ఈ ప్లాంట్ ఏర్పాటుతో రామగుండం ప్రాంతం కొత్త దిశలో అభివృద్ధి సాధించనుంది,” అన్నారు.

“ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానికంగా పారిశ్రామిక అభివృద్ధి వేగం పెరుగుతుంది. యువతకు వందల సంఖ్యలో ప్రత్యక్ష ఉద్యోగాలు, వేల సంఖ్యలో పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇప్పటికే సింగరేణి, NTPC, జెన్కో వంటి సంస్థలతో రామగుండం ఒక పారిశ్రామిక కేంద్రంగా పేరుగాంచింది. ఇప్పుడు 800 మెగావాట్ల(800 MW) ప్లాంట్‌తో ఆ స్థాయి మరింత పెరగనుంది,” అని పేర్కొన్నారు.

“ఈ ప్రాజెక్ట్ ద్వారా పెద్ద మొత్తంలో నిధులు రాష్ట్రానికి, స్థానికంగా రామగుండం ప్రజలకు ఉపయోగపడతాయి. ఈ ప్రాంతంలోని చిన్న వ్యాపారాలు, హోటల్ రంగం, ట్రాన్స్‌పోర్ట్, కన్స్ట్రక్షన్ రంగాలు పునరుజ్జీవనం పొందుతాయి. అభివృద్ధితోపాటు జీవన ప్రమాణాలు కూడా మెరుగవుతాయి. ఇది రామగుండం ప్రజల సుదీర్ఘకాల స్వప్నానికి ఆరంభం మాత్రమే,” అని అన్నారు.

ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్(MLA Raj Thakur Makkan Singh) గత రెండేళ్లలో రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి అనేక ప్రాజెక్టులు తీసుకువచ్చారు. విద్య, రహదారులు, మహిళా సంక్షేమం, యువజన అభివృద్ధి, పారిశ్రామిక విస్తరణ వంటి అనేక రంగాల్లో కోట్లాది రూపాయల నిధులు సమకూర్చి, ప్రజల విశ్వాసం సంపాదించారు. ఈ కొత్త విద్యుత్ ప్లాంట్ ప్రాజెక్ట్ ఆయన కృషికి మైలురాయిగా నిలవనుంద‌న్నారు.

Leave a Reply