80% polling | ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి

80% polling | ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి
80% polling | ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలను చిత్తశుద్ధితో, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి పోలింగ్(Polling) సిబ్బందికి సూచించారు. ఈ రోజు ఆమె దేవరకొండ డివిజన్ కొండమల్లేపల్లిలో ఏర్పాటు చేసిన మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల డిఆర్సి సెంటర్‌ను సందర్శించి ప్రిసైడింగ్(presiding), సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఆర్ ఓలకు పలు సూచనలు చేశారు. ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని, పోలింగ్ కేంద్రాలను ముందే చూసుకోవాలని, పోలింగ్ కేంద్రంలో సరైన విధంగా లైటింగ్ ఉండేలా చూడాలని, ఓటింగ్ కంపార్ట్మెంట్ కిటికీల దగ్గర ఏర్పాటు చేయవద్దని చెప్పారు. ముగ్గురికి మించి ఓటర్లు పోలింగ్ బూతులో ఉండరాదన్నారు .
కౌంటింగ్‌కు సంబంధించి సూచనలు చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కావాలని, ఇందుకుగాను కౌంటింగ్(Counting) ఏర్పాట్లు ముందే చూసుకోవాలన్నారు. ఎక్కువ మంది ఓటర్లు ఉన్నచోట ఎక్కువ మంది ఏజెంట్లను నియమించుకునేలా అభ్యర్థులకు ముందే తెలియజేయాలని, 2:15 గంటల తర్వాత కౌంటింగ్ కేంద్రంలోకి ఎవరిని అనుమతించడం జరగదని స్పష్టం చేశారు.
ఒకవేళ ఎవరైనా అభ్యర్థి రీకౌంటింగ్ చేయదలిస్తే కౌంటింగ్ పూర్తయిన 15 నిమిషాల లోపే రాతపూర్వకంగా ఆర్ ఓకు దరఖాస్తు ఇవ్వాలని, ఆర్ఓ నిర్ణయం పైనే రీకౌంటింగ్ ఆధారపడి ఉంటుందని తెలిపారు. జిల్లాలోని 80% పోలింగ్(80% polling) కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్(Webcasting) ఏర్పాటు చేయడం జరిగిందని, తక్కిన వాటిలో వీడియోగ్రఫీ చేయిస్తున్నామని అన్నారు.
స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ మెటీరియల్‌ను ఎంపీడీవోలు, ఎస్ టి ఓ లో జమ చేసే వరకు బాధ్యత తీసుకోవాలని చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు ఎక్కువ సిబ్బందిని నియమించడం జరిగిందని, ఎన్నికలు నియమ నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని తెలిపారు. కాగా మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు 269 పోలింగ్ కేంద్రాలలో 2206 వార్డులలో జరగనున్నాయి. ఇందులో 7 వార్డులకు ఎలాంటి నామినేషన్లు రాలేదని, 42 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం కాగా, 596 వార్డులు ఏకగ్రీవమయాయని కలెక్టర్(Collector) వెల్లడించారు.
ఏకగ్రీవాల అనంతరం 227 గ్రామ పంచాయతీలకు, 1603 వార్డులకు పోలింగ్ జరగనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. 226 పోలింగ్ లొకేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని, 81 మంది స్టేజి వన్ ఆర్వోలు మరో 81 మంది స్టేజి వన్(Stage One) ఏ ఆర్ ఓ లు, 9 మంది ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లు, స్టేజ్ టు ఆర్వోలుగా 300 మందిని నియమించడం జరిగిందని స్పష్టం చేశారు.
52 మంది జోనల్ ఆఫీసర్లు, 83 మంది రూట్ ఆఫీసర్లు, 2647 మంది పిఓలు, 2959 మంది ఇతర పిఓలను నియమించామని, 236 గ్రామపంచాయతీలలో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశామని, 89 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని ఆమె వెల్లడించారు. 2647 బ్యాలెట్ బాక్స్ లు(Ballot Boxes) ఏర్పాటు చేశామని, 227 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు.

మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అభ్యర్థులతో పాటు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఏజెంట్లు అందరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు సవ్యంగా నిర్వహించేందుకు 40 మంది జిల్లా అధికారుల(District Officials)ను సైతం నియమించినట్లు వెల్లడించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి, కొండపల్లి ప్రత్యేక అధికారి విజయేందర్ రెడ్డి, డీపీఓ వెంకయ్య, డీఆర్డిఓ శేఖర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
