4th day | సెన్సెక్స్ 77,409.. నిఫ్టీ 24,168 వద్ద ముగింపు
4th day | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు కూడా లాభాలతో ముగిశాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైనప్పటికీ, చివరి గంటలో కొనుగోళ్లు పెరగడంతో సూచీలు పుంజుకున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం, హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు సరఫరా సాధారణ స్థితికి చేరుతుందన్న అంచనాలు మదుపర్లలో సానుకూలతను పెంచాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 78.23 డాలర్లకు తగ్గడం, మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి బలపడి రూ.94.33 వద్ద ట్రేడవడం మార్కెట్లకు అదనపు బలాన్ని ఇచ్చాయి. గత సెషన్‌లో 77,155 వద్ద ముగిసిన సెన్సెక్స్ గురువారం రోజంతా ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ చివరికి 254 పాయింట్లు లాభపడి 77,409 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా అదే బాటలో సాగి 82 పాయింట్లు ఎగబాకి 24,168 వద్ద స్థిరపడింది.
వ్యక్తిగత షేర్లలో మ్యాక్స్ హెల్త్‌కేర్, నైకా, అదానీ పవర్, సీడీఎస్‌ఎల్, కేన్స్ టెక్నాలజీస్ షేర్లు మంచి లాభాలను నమోదు చేశాయి. మరోవైపు ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, ఎన్‌బీసీసీ, పేటీఎం, వరుణ్ బేవరేజెస్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.రంగాల వారీగా చూస్తే బ్యాంకింగ్ రంగంలో కొనుగోళ్లు జోరందుకోవడంతో బ్యాంక్ నిఫ్టీ 378 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 255 పాయింట్లు పెరిగి విస్తృత మార్కెట్‌లోనూ సానుకూల ధోరణి కనిపించింది.
