ఈరోజు అవతారం మహాదుర్గ..

సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్దసాధికే
త్య్రంబకే దేవి మహగౌరి నమోస్తుతే

దుర్గానవరాత్రులలో ప్రస్తుత సప్తమి మరియు అష్టమి తిధుల కలయికలో అమ్మను మహాదుర్గగా ఆరాధిస్తారు. పంచ ప్రకృతి రూపాలలో మొదటిది దుర్గా రూపము. భవబంధాలలో చిక్కుకున్న మానవులను ఉద్దరించే మాత దుర్గాదేవి. కోటి సూర్య తేజముతో దుర్గా రూపము భక్తులకు కనువిందు చేస్తుంది. సింహవాహనముపై అధిరోహించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తుంది. దుర్గముడనే రాక్షసుని సంహరించి, దుర్గతులను నాశనమొనరించి నందువలన ఈమెను దుర్గాదేవి అని కూడా పిలుస్తారు. దుర్గాదేవి ‘‘లోహుడు’’ అనే రాక్షసుని అష్టమినాడు వధించినది. ఈ రోజు లోహాలను పూజిస్తే మేలు కలుగుతుంది. దుర్గలోని ‘దుర్’ అంటే దుఃఖము, దుర్భిక్ష్యము, దుర్వ్యసనము, దారిద్య్రము మొదలైనవి అని అర్థం మరియు ‘గ’ అంటే నశింపచేసేది అని అర్థము. అందువలనే దుర్గ అంటే దుర్గతులను తొలగించే దుర్గేయురాలు. దుర్గను ఆరాథన విధానములో ‘దుం’ అనే బీజాక్షరాన్ని కలిపి పూజచేస్తారు. దుర్గను ఆరాధించటం వన భూత, ప్రేత, పిశాచ, రక్కసుల బాధలు కలుగవని శాస్త్ర వచనము.
నిస్తుల నీలచికురా నిరపాయా నిరత్యయా
దుర్లభా దుర్గమా దుర్గా దు:ఖ హంత్రీ సుఖప్రదా
దుష్టదూరా దురాచారశమనీ దోషవర్జితా
సర్వజ్ఞా సాంద్రకరుణా సమానాధిక వర్జితా
ఈ రోజు దుర్గాసప్తశతి, చండీ పారాయణ, దుర్గా స్తోత్రము విశేష ఫలదాయకము. ఎరుపు రంగు వస్త్రములు, ఎరుపు రంగు పూవులు అమ్మవారికి సమర్పించాలి. అమ్మవారికి పొంగలి, పులిహోర, పులగం నైవేద్యంగా సమర్పించాలి.
శ్రీశైలం భ్రమరాంబ నందివాహనంపై మహాదుర్గ అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు.
శుభం భూయాత్!!
డా. దేవులపల్లి పద్మజ
విశాఖపట్టణము
