ఇంధన ధరల పెంపుపై జూన్ 9న రాష్ట్రవ్యాప్త రాస్తారోకో

ఇంధన ధరల పెంపుపై జూన్ 9న రాష్ట్రవ్యాప్త రాస్తారోకో

ఉమ్మడి గుంటూరు, ఆంధ్రప్రభ బ్యూరో:

పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ ప్రకటించారు. ఆదివారం సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని, దీనికి వ్యతిరేకంగా ప్రజలు పెద్దఎత్తున ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వరుసగా పెంచుతూ ప్రజలపై భారాలు మోపుతోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదనపు భారం వేస్తోందని ఆరోపించారు. ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని జంగాల అజయ్ కుమార్ ఆరోపించారు. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా ఇతర అంశాలపై ఎక్కువగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

గత ప్రభుత్వ హయాంలో అప్పులపై విమర్శలు చేసిన చంద్రబాబు, ప్రస్తుతం భారీగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల భారంలోకి నెడుతున్నారని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని, జూన్ 9న నిర్వహించే రాస్తారోకో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply