సమతుల్య ఎరువుల వినియోగంపై రైతులకు శిక్షణ

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : మండలంలోని రాకెట్ల గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో మంగళవారం ఆత్మ సౌజన్యంతో రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉరవకొండ వ్యవసాయ డివిజన్ సహాయ సంచాలకులు సత్యనారాయణ మాట్లాడుతూ ఖరీఫ్-2026 లో సాగు చేస్తున్న పంటలైన వేరుశెనగ, కంది, వరి మొక్కజొన్న, ప్రొద్దు తిరుగుడు, ఆయిల్ ఫామ్ వంటి పంటల్లో నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను సిఫారసు చేసిన మేరకు మాత్రమే వాడాలన్నారు. పచ్చి రొట్టె ఎరువులైన జీలుగ, జనుము, పిల్లి పెసర, జీవన ఎరువులను వాడి భూసారాన్ని భూమిలో పోషకాల విలువలను పెంచుకుంటూ సూక్ష్మజీవుల ప్రక్రియను పెంపొందిస్తూ పంటలు పండించాలన్నారు.

ఎరువులను అధిక మోతాదు లో వాడుట ద్వారా నేల ఆరోగ్యంబాగా దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. వివిధ పంటల్లో అంతర పంటలుగా ముఖ్యంగా కందిలో గోరుచిక్కుడు, ఫీల్డ్ బీన్, అలసంద, ఆముదము, సజ్జ లాంటి పైర్లను వేసు కోవాలన్నారు. ఎల్ నినో మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సరళి, పంటల మార్పు, పంటల మళ్లింపు కలిగి రైతులు పంట లను సాగు చేయాలని తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్ లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతాయి అనే ఉద్దేశం చేత ఏక పంట కాకుండా బహుల పంటలు వైపు రైతులు మొగ్గు చూపాలన్నారు. మెట్ట ప్రాంతంలో సాగుచేసే పంటలు విత్తన గుళికలు తయారు చేసుకొని మాత్రమే వేయాలన్నారు.

నీటి ఆధారం ఉండే చోట పి ఎం డి ఎస్ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతుల నుపాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు ఆధార్ కార్డు ఆధారంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, రిటైల్ దుకాణాలు, రైతు సేవ కేంద్రాల ద్వారా ఏపీ ఎయిమ్స్ యాప్ ఆన్లైన్ విధానం ద్వారా యూరియా, డిఎపి ఎరువులను పొంద వచ్చని తెలిపారు. పప్పు ధాన్యాల సాగును పెంచుతూ, నేల సారాన్ని సంరక్షిస్తూ, పప్పు దినుసులు, నూనె గింజల దిగుబడిలో స్వయం సమృద్ధి సాధించే దిశగా రైతులు ప్రయత్నం చేయాలన్నారు.

రైతన్న మీకోసం కార్యక్రమం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమం లో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శిరీష, కీటక విభాగం, మండల వ్యవసాయ అధికారి రామకృష్ణుడు, ఆత్మ సిబ్బంది కిన్నెర , విస్తరణ అధికారి భరత్ రాజ్, రైతు సేవా కేంద్ర సిబ్బంది రామ్మూర్తి, ఈ శిక్షణ పాల్గొన్నారు.