వర్షాకాలంలో పరిశుభ్రత పై ప్రత్యేక శ్రద్ధ చూపాలి..

వర్షాకాలంలో పరిశుభ్రత పై ప్రత్యేక శ్రద్ధ చూపాలి..

  • తహసిల్దార్ కిరణ్ కుమార్

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు భీమ్‌గల్ మండలంలోని పురాణిపేట్ గ్రామ పంచాయతీలల్లో శనివారం గ్రామ సభను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసిల్దార్ కిరణ్ కుమార్ హాజరయ్యారు. గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టడమే లక్ష్యంగా ఈ గ్రామ సభ నిర్వహించారు. ముందుగా సర్పంచ్ బుర్ర సుమ, (దేవేందర్ గౌడ్) మాట్లాడుతూ, గ్రామంలో నెలకొన్న తాగునీరు,పారిశుద్ధ్యం,రహదారులు,విద్యుత్ తదితర సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామాభివృద్ధికి అధికారులు సహకరించాలని కోరారు.

ఉపసర్పంచ్ కూడా గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తహసిల్దార్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో గ్రామ ప్రజలు పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి నిర్వహించడం వల్ల గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగు పడటంతో పాటు వ్యాధులు వ్యాపించకుండా నివారించ వచ్చని తెలిపారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, దోమల నివారణకు ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని సూచించారు.

“మీ గ్రామాన్ని మీరే కాపాడుకోవాలి” అనే సందేశంతో ప్రజల్లో అవగాహన కల్పించిన తహసిల్దార్, గ్రామ పరిశుభ్రత బాధ్యత కేవలం అధికారులదే కాకుండా ప్రతి గ్రామస్తుడిదని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛత కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ ప్రతి ఇంటి వద్ద కనీసం ఒక మొక్క నాటాలని నిర్ణయించారు. నాటిన మొక్కలను పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు.

అనంతరం నూతనంగా తాసిల్దార్ బాధ్యతలు చేపట్టిన మొదటిసారి వచ్చిన సందర్భంగా తహసిల్దార్ కిరణ్ కుమార్ కు గ్రామ పాలకవర్గమా ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయత్ కార్యదర్శి అంజయ్య, హెడ్ కానిస్టేబుల్ జీవన్,గ్రామ పాలనాధికారి దత్తాత్రేయ, ఉప సర్పంచ్ గోవిండు హరికృష్ణ, వార్డ్ సభ్యులు చరణ్, సురేష్, శ్యామల, మమత, రాజేందర్, సంధ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు శంకర్, నాయకులు సురేష్, సాగర్, హరీష్, వంశీ, ప్రజా ప్రతినిధులు, మహిళల సంఘాల సభ్యులు, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply