యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనులు వేగవంతం చేయాలి
దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని రెబ్బనపల్లి గ్రామపంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన, పనులను సత్వరమే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలను ప్రారంభించే అవకాశం ఉన్నందున, విద్యార్థులకు ప్రవేశాలు కల్పించే సమయానికి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా నిర్మాణ పనులను 2027 ఫిబ్రవరి నాటికి పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని సూచించారు.
నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. పాఠశాల భవన నిర్మాణంతో పాటు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుపై అధికారులతో చర్చించారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా పాఠశాలను సిద్ధం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో దండేపల్లి మండల పంచాయతీ అధికారి దుర్గ ప్రసాద్, మండల విద్యాశాఖ అధికారి మంత్రి రాజు, సైట్ ఇంజనీర్, గ్రామ కార్యదర్శి, గ్రామ సర్పంచ్ కందుల కల్యాణి అశోక్, ఉపసర్పంచ్, పలువురు వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
