తీగలగుట్టపల్లి ఆర్‌ఓబీ పనులను వెంటనే పూర్తిచేయాలి

  • కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా

కరీంనగర్, ఆంధ్రప్రభ : కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లి రైల్వే గేట్ వద్ద మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆర్‌ఓబీ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి ప్రజల రవాణా కష్టాలను తీర్చాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ రాజేందర్ రావు సూచన మేరకు ఆదివారం 3వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మూల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రైల్వే ట్రాక్ సమీపంలో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా మూల కృష్ణారెడ్డి మాట్లాడుతూ గుంతల రోడ్డు కారణంగా వాహనదారులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఐదు నిమిషాల్లో చేరుకోవాల్సిన ప్రాంతానికి గంట సమయం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్‌ఓబీ నిర్మాణ పనులు రోజుకు నాలుగైదుగురు కూలీలతో నత్తనడకన సాగుతున్నాయని మండిపడ్డారు.

ఎంపీ బండి సంజయ్ గతంలో ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేసి పనులను వదిలేశారని ఆరోపించారు. మళ్లీ ఎన్నికలు వస్తేనే ఆర్‌ఓబీ పనులు పూర్తిచేస్తారా అని ప్రశ్నించారు. అధికారులు వెంటనే స్పందించి నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఆకుల నరసయ్య, కార్పొరేటర్ బానోతు భాస్కర్ నాయక్, సీనియర్ నాయకులు కాసేట్టి శ్రీనివాస్, 3వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, 2వ డివిజన్ అధ్యక్షుడు కొలగాని అనిల్, మనోహర్, రాము, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.