Varanasi | తుపాకీ మిస్ఫైర్ … ఇద్దరికి తీవ్ర గాయాలు…
ఆయుధాన్ని తనిఖీ చేస్తుండగా ప్రమాదం..
విమానాశ్రయంలో కలకలం
Varanasi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్లోని వారణాసి విమానాశ్రయంలో తుపాకీ మిస్ఫైర్ కావడంతో ఇద్దరు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడిన ఘటన కలకలం రేపింది. ఇవాళ ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయుధాన్ని తనిఖీ చేస్తుండగా అకస్మాత్తుగా కాల్పులు జరగడంతో విమానాశ్రయ ప్రాంగణంలో కొద్దిసేపు తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
ముంబై వెళ్లేందుకు ఓ ప్రయాణికుడు తన భార్యతో కలిసి వారణాసి విమానాశ్రయానికి వచ్చారు. ఉదయం సుమారు 9.30 గంటల సమయంలో భద్రతా సిబ్బంది ఆయుధాన్ని తనిఖీ చేస్తుండగా అనుకోకుండా మిస్ఫైర్ అయింది.
ఈ ఘటనలో అక్కడ విధుల్లో ఉన్న ఏఏఐసీఎల్ఏఎస్ భద్రతా తనిఖీ సిబ్బంది ఇద్దరికి బుల్లెట్ గాయాలయ్యాయి. వారిని వెంటనే విమానాశ్రయం నుంచి సమీపంలోని న్యూ లక్ష్మి ట్రామా సెంటర్కు తరలించారు. అక్కడ వైద్యులు వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. గాయపడిన సిబ్బంది పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
కాల్పుల శబ్దంతో విమానాశ్రయంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే విమానాశ్రయానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి, మిస్ఫైర్కు దారితీసిన కారణాలపై ఆరా తీశారు.
ఆయుధాన్ని తనిఖీ చేసే సమయంలో భద్రతా నిబంధనలు పాటించారా? ఆయుధం ఎలా మిస్ఫైర్ అయింది? ప్రయాణికుడు ఆయుధాన్ని విమానాశ్రయానికి తీసుకురావడానికి సంబంధించిన నిబంధనలు సక్రమంగా పాటించారా? వంటి అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భద్రతా నిబంధనల ఉల్లంఘన జరిగిందా అనే కోణంలోనూ కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ ఘటనతో విమానాశ్రయ భద్రతా ఏర్పాట్లపై కూడా చర్చ మొదలైంది. మిస్ఫైర్కు అసలు కారణం దర్యాప్తులో తేలాల్సి ఉంది.
