బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుక… సినీ, రాజకీయ ప్రముఖుల సందడి
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహ వేడుక హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో ఇవాళ ఘనంగా జరిగింది. జనని, సూర్యతేజల వివాహానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ. రేవంత్‌రెడ్డి, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మాజీ మంత్రి కేటీఆర్, ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత, ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున తదితరులు వివాహ వేడుకకు హాజరయ్యారు.

జేఆర్సీ కన్వెన్షన్‌కు చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి నూతన వధూవరులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా వివాహ వేడుకకు హాజరై జనని, సూర్యతేజలను ఆశీర్వదించారు. ఇద్దరు ముఖ్యమంత్రుల రాకతో వివాహ వేడుకకు మరింత ప్రత్యేకత సంతరించుకుంది.

కాగా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా కూడా వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. సంప్రదాయ చీరకట్టులో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, ఆత్మీయుల సమక్షంలో వివాహ వేడుక వైభవంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖుల రాకతో జేఆర్సీ కన్వెన్షన్ సందడిగా మారింది.
