Mumbai | నావికుడి కుటుంబంలో నలుగురు మృతి…

ఇంట్లో మృతదేహాల గుర్తింపు
కొన్ని రోజులుగా బయటకు రాకపోవడంతో అనుమానం..


Mumbai | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ముంబైలోని కొలాబా నేవీ నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ నావికుడి కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దంపతులతో పాటు వారి ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. కొన్ని రోజులుగా కుటుంబ సభ్యులు ఎవరూ బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది.

దీంతో వారు ఇంటి కిటికీలో నుంచి పరిశీలించగా కుటుంబ సభ్యులు విగతజీవులుగా కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

కుటుంబ సభ్యుల మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు నేవీ నగర్‌కు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనకు సంబంధించి బంధువులను కూడా పోలీసులు విచారిస్తున్నారు.