హామీలు అమలు చేస్తే దండ వేస్తాం..
లేకపోతే దండయాత్ర చేస్తాం
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కల్లుగీత కార్మిక సంఘం నిర్వహిస్తున్న గీతన్నల చైతన్య బస్సు యాత్ర ఆదివారం ఎల్కతుర్తికి చేరుకుంది. సత్యసాయి గార్డెన్ వద్ద గీత కార్మికులు మహిళల బోనాలు, కోలాటాలు, డప్పు చప్పుళ్లతో యాత్రకు ఘన స్వాగతం పలికారు. మండల అధ్యక్షుడు జనగాని లక్ష్మీనారాయణ గౌడ్, ప్రధాన కార్యదర్శి బత్తిని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమణ ఎల్కతుర్తి జంక్షన్‌లో సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ గీత కార్మికులు కోరుతున్నవి గొంతెమ్మ కోరికలు కావని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నామని అన్నారు.
గౌడ సంక్షేమానికి బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గీత కార్మికుల పింఛన్‌ను రూ.4 వేలకు పెంచాలని, వృత్తిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.20 కోట్ల పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కల్లుగీత కార్మిక సంఘం పదేళ్ల క్రితం నిర్వహించిన బస్సు యాత్ర ఫలితంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించనున్నారని రమణ తెలిపారు. సర్వాయి పాపన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంపై ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇది గీత కార్మిక సంఘం పోరాట ఫలితమని పేర్కొన్నారు.
కల్లుగీత కార్మిక సంఘం ఏ రాజకీయ పార్టీకి కొమ్ముకాయదని, గీత కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడే సంస్థ అని రమణ అన్నారు. అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ కార్మికులను చైతన్యపరిచేందుకే ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం హామీలను నెరవేర్చకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గీత కార్మికుల హామీల అమలుకోసమే చైతన్య యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తాటి కేంద్రాలను ఏర్పాటు చేసి కల్లుకు మార్కెట్ కల్పించాలని, గీత కార్మికులకు ఉపాధి అవకాశాలు పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. జీవో 560ను తక్షణమే అమలు చేయాలని, తాటి వనాలకు ఐదు ఎకరాల భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు.
మండల అధ్యక్షుడు జనగాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గీత కార్మికుల హక్కుల కోసం ఎంతోమంది అమరులయ్యారని, వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ గౌని వెంకన్న, వెంకట మల్లయ్య, గౌని సాంబయ్య, కొండం కరుణాకర్, రాష్ట్ర కమిటీ సభ్యులు దూలం ప్రభాకర్, గౌరవ సలహాదారు గొడిశాల యాదగిరి గౌడ్, ఉపాధ్యక్షుడు శ్రీపతి సదానందం, గౌడ సంఘం అధ్యక్షుడు గొడిశాల కుమారస్వామి, మార్కెట్ డైరెక్టర్ గొడిశాల రాజయ్య, కల్లుగీత కార్మిక సంఘం సామాజిక మాధ్యమాల కన్వీనర్ జనగాని ప్రవీణ్ గౌడ్, శ్రీపతి బిక్షపతి గౌడ్, గొడిశాల చంద్రమౌళి, గొడిశాల సుమన్ గౌడ్, జనగాని సురేష్ గౌడ్, గొడిశాల అర్జున్ గౌడ్, గౌడ సంఘం ఉపాధ్యక్షుడు గొడిశాల రాజేష్, వెండి రాజు, జిల్లా సభ్యులు బుర్ర రంజిత్, హసన్‌పర్తి కల్లుగీత కార్మిక మండల అధ్యక్షుడు మోటపోతుల రాజు, గీత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
