ప్రతి సోమవారం మండల ప్రజావాణి..
- ఎంపీడీవో పాక శ్రీనివాసులు
రాయపర్తి, ఆంధ్రప్రభ : ప్రజల సమస్యలను మండల స్థాయిలో నేరుగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చేపట్టిన మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం రాయపర్తి మండలంలో ప్రారంభం కానుంది. వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద ఆదేశాల మేరకు సోమవారం నుంచి ప్రతి సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించనున్నట్లు ఎంపీడీవో పాక శ్రీనివాసులు తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వివిధ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండల స్థాయిలోని 22 శాఖల అధికారులు ప్రజావాణికి నేరుగా హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు.
రెవెన్యూ, పోలీస్, వ్యవసాయం, ఉద్యాన, విద్య, వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్, సంక్షేమ శాఖలకు సంబంధించిన సమస్యలను ఒకే వేదికపై అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల నుంచి అందిన అర్జీలను అధికారులు వెంటనే పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నారు. దీంతో ప్రజలకు సత్వర న్యాయం అందడంతో పాటు పారదర్శక పాలనకు దోహదపడుతుందని అధికారులు తెలిపారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గ్రామానికి చేరాలన్నదే ప్రజావాణి ప్రధాన లక్ష్యమని ఎంపీడీవో తెలిపారు. అధికారులు ప్రజలకు చేరువై వారి సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ఇది మంచి వేదికగా నిలుస్తుందన్నారు. మండల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో పాక శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి కొనసాగుతుందని తెలిపారు.
