అర్హులైన ఓటరుగా నమోదు చేయాలి
తహశీల్దార్ రమేష్ బాబు
నర్సింహులపేట, జూన్ 25 (ఆంధ్రప్రభ): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్క ఓటరుకు అవకాశం కల్పించాలని మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట తహశీల్దార్ రమేష్ బాబు బూత్ లెవల్ అధికారులకు (బీఎల్‌వోలు) సూచించారు. గురువారం మండల కేంద్రంలో బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తున్న విధానాన్ని, ఓటరు నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ, దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సమగ్ర ఓటరు జాబితా సవరణ చేపడుతున్న నేపథ్యంలో బీఎల్‌వోలు అత్యంత బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయడంతో పాటు వివరాల నమోదు, అవగాహన కల్పన వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు.
ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ఓటర్లకు ఫారాలు అందజేయాలని, ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తూ సవరణ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. ఓటరు జాబితా సవరణలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఓటర్ల నుంచి అందిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా స్వీకరించి, వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ రమేష్ బాబు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీపీవో పాషా, బీఎల్‌వో విమల తదితరులు పాల్గొన్నారు.
