లేపాక్షిలో యోగాంధ్రకు ముస్తాబు..

ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న “యోగాంధ్ర” కార్యక్రమ ప్రారంభోత్సవాన్ని జూన్ 7న లేపాక్షిలో ఘనంగా నిర్వహించేందుకు చేపడుతున్న ఏర్పాట్లను శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ శుక్రవారం పరిశీలించారు.

లేపాక్షిలోని శ్రీ వీరభద్రస్వామి దేవాలయం ముందు ప్రాంగణంలో జరగనున్న కార్యక్రమం కోసం చేపట్టిన ఏర్పాట్లను ఆయన స్వయంగా సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.

జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, విద్యార్థులు, యువత, మహిళా సంఘాల సభ్యులు, యోగా సాధకులు, శిక్షణ పొందిన యోగా మాస్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వేదిక నిర్మాణం, కూర్చోవడానికి సౌకర్యాలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, వైద్య సేవలు, విద్యుత్ సౌకర్యాలు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.

కార్యక్రమం విజయవంతం కావడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించిన కలెక్టర్, యోగ ప్రాముఖ్యతను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి అధిక సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లేపాక్షి చారిత్రక, సాంస్కృతిక వైభవానికి తగిన రీతిలో కార్యక్రమాన్ని నిర్వహించాలని పేర్కొన్నారు.

అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో కార్యాచరణ ప్రణాళిక, శాఖల వారీ బాధ్యతలు, ప్రజల రాకపోకల నిర్వహణ, భద్రతా చర్యలు, యోగా ప్రదర్శనలు, యోగా మాస్టర్ల సమన్వయం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.

జూన్ 7న జరగనున్న యోగాంధ్ర ప్రారంభోత్సవంలో ప్రజలు, యువత, మహిళలు, విద్యార్థులు, యోగా పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా పరిపాలన విజ్ఞప్తి చేసింది.

ఈ సమీక్ష సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి చక్రపాణి, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ నరసయ్య, లేపాక్షి ఎంపీడీఓ, తహసీల్దార్, గ్రామ కార్యదర్శి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందస్తుగా పూర్తి చేస్తామని వారు కలెక్టర్‌కు వివరించారు.

Leave a Reply