గులాబీమయంగా మారిన జగిత్యాల..

జగిత్యాల, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. దాదాపు ఏడాది కాలం తర్వాత కేసీఆర్ ప్రజల ముందుకు వస్తుండటంతో, ఈ ప్రజా ఆశీర్వాద సభ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జగిత్యాల నియోజకవర్గ ​రాజకీయ సమీకరణాల్లో పలు మార్పులు చోటు చేసుకోబోతున్న ​ఈ సభ కేవలం రాజకీయ ప్రసంగాలకే పరిమితం కాకుండా, కీలక చేరికలకు వేదిక కానుంది. సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. కేసీఆర్ స్వయంగా ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు.

ఇది ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ​సభ ఏర్పాట్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, ఎమ్మెల్యేలు సంజయ్, కౌశిక్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి తదితరులు తో కలిసి రెండు సార్లు పర్యవేక్షించారు., సభకు వచ్చే కార్యకర్తలకు, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు సమకూర్చారు

రేపు జరిగే సభలో ​కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు?

చాలా కాలం తర్వాత మైక్ పట్టనున్న కేసీఆర్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేస్తారు? హామీల అమలుపై సర్కారును ఎలా నిలదీస్తారు? అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా రైతాంగ సమస్యలు, సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులపై కేసీఆర్ ఘాటుగా స్పందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply