దేశభక్తులు ఎవరో, దేశ ద్రోహులు ఎవరో !!

  • ధర్మం ముసుగులో దాడి చేస్తే కేసులు ఉండవా ?
  • రాజ్యాంగాన్ని ధిక్కరించే వాళ్ళు దేశ ద్రోహులు.
  • సీజేఐ మీద బూటుతో దాడి చేస్తే చట్టపరమైన చర్యలు ఎందుకు లేవు
  • కత్తితో దాడి చేసినా ఇంతేనా పరిస్థితి ?
  • మమ్మల్ని అంటరానివారిగా చేసింది ఏ ధర్మమో జవాబు కావాలి.
  • సీజేఐ పై దాడికి నిరసనగా నవంబర్ 17 న ఛలో ఢిల్లీ.
  • ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ.

సోమాజిగూడ, (ఆంధ్రప్రభ): సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్. గవాయి పైన జరిగిన అమానుష దాడి నేపథ్యంలో దేశభక్తులు ఎవరో, దేశద్రోహులు ఎవరో విస్తృతంగా చర్చ జరగాలని, భారతదేశంలో ఉంటూ భారత రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్న వారు రాజ్యాంగాన్ని దిక్కరిస్తున్న వాళ్లు దేశద్రోహులేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ అన్నారు.

ఈ సందర్భంగా సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ వ్యవస్థలో అత్యున్నతమైన సుప్రీం కోర్టులో చీఫ్ జస్టిస్, దళితుడైన బీఆర్. గవాయి పైన అమానుష దాడి జరిగి నెలరోజులు కావస్తున్నా, నేటికీ చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం అత్యంత దారుణమని పేర్కొన్నారు.

దేశ ప్రజలంతా ఈ దారుణాన్ని ఖండించినా కూడా చట్టపరమైన వ్యవస్థలు కనీసం సుమోటోగా కేసు నమోదు చేయకపోవడం దళితులను చిన్నచూపు చూసినట్టేనని అన్నారు. నిందితుడు బూట్లతో దాడి చేసినా వ్యవస్థలు మౌనంగా ఉంటే, రేపు కత్తులతో దాడులు జరిగినా ఇలాగే ఉంటాయా అని ప్రశ్నించారు.

“డిల్లీ పోలీసులు, న్యాయవ్యవస్థ, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ దాడిని సుమోటోగా ఎందుకు స్వీకరించలేదు?” అని ఆయన ప్రశ్నించారు. పత్రికల్లో వచ్చిన వార్తలను ఆధారంగా చేసుకొని ఎన్నో సంఘటనలను సుమోటోగా స్వీకరిస్తున్నా, న్యాయవ్యవస్థకే సుప్రీంగా ఉన్న సుప్రీం కోర్టులో చీఫ్ జస్టిస్ పైన దాడి జరిగితే మౌనం ఎందుకని ఆయన ప్రశ్నించారు.

ఈ దాడిని “ధర్మం కోసం చేశానని” నిందితుడు బహిరంగంగా చెబుతుంటే, కొంతమంది దానిని సమర్థిస్తూ “ఇంకా దాడులు చేస్తాం” అని చెబుతుండడం, వ్యవస్థలు మాత్రం మౌనం వహించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. “ధర్మం ముసుగులో దాడులు చేస్తే చట్టపరమైన చర్యలు ఉండవా? కేసులు పెట్టరా? అరెస్టులు జరగవా? శిక్షలు విధించరా?” అని మండిపడ్డారు.

విశ్వాసాలు, ధర్మాలు రాజ్యాంగం మరియు చట్టానికి లోబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. “గవాయి పైన జరిగిన దాడి దళితులపైన, రాజ్యాంగపైన దాడిగా ఉంది” అని అన్నారు. రాజ్యాంగం గిట్టని శక్తులే, దళితులంటే చిన్నచూపు చూసే వాళ్లే ఈ దాడికి తెగబడుతున్నారని మండిపడ్డారు.

దాడి చేసినవాళ్లు చెబుతున్న ధర్మాలు నిజంగా ఉత్తమమైనవే అయితే, ఈ దేశంలో దళితులు అంటరానివారిగా ఎందుకయ్యారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. “ఆ ధర్మాలు మంచివే అయితే దళితులు పశువుల కన్నా హీనంగా ఎందుకు చూడబడ్డారు?” అని ప్రశ్నించారు.

రాజ్యాంగం ఏర్పడిన తర్వాతనే దళితులు మనుషులుగా గుర్తింపు పొందారని, రాజ్యాంగం వల్లనే దళితులు ఉన్నత స్థానాలకు చేరుకున్నారని అన్నారు. కనుక దళితుల మీద దాడి చేయడం అంటే రాజ్యాంగంపై దాడి చేయడమేనని అన్నారు. “ధర్మాల పేరుతో దాడులు చేస్తామంటే, రాజ్యాంగాన్ని విధ్వంసం చేస్తామంటే సహించబోము” అని స్పష్టం చేశారు.

రాజ్యాంగాన్ని ధిక్కరించే వారు, చట్టాలను విధ్వంసం చేసే వారు దేశద్రోహులుగానే మిగిలిపోతారని హెచ్చరించారు. “ఇప్పుడు దేశంలో దేశభక్తులు ఎవరో, దేశద్రోహులు ఎవరో విస్తృత చర్చ జరగాలి” అని అన్నారు.

Leave a Reply