నేడు పశ్చిమలో పింఛన్ల పంపిణీ

నేడు పశ్చిమలో పింఛన్ల పంపిణీ
2,21,359 మంది లబ్ధిదారులకు రూ.96.77 కోట్ల పంపిణీ
కలెక్టర్ చదలవాడ నాగరాణి
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: పశ్చిమ గోదావరి జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు సామాజిక భద్రతను మరింత బలోపేతంచేసే దిశగా జూన్ 1వ తేదీన విస్తృత స్థాయిలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా 25 రకాల పింఛన్లకు సంబంధించి మొత్తం 2,21,359 మంది లబ్ధిదారులకు రూ.96,77,38,500 విలువైన పింఛన్లు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు వెల్లడించారు. ప్రతి నెల మాదిరిగానే ఈసారి కూడా పింఛన్లను లబ్ధిదారులకు సమయానికి అందించేందుకు సంబంధిత స్వర్ణ వార్డు మరియు స్వర్ణ గ్రామ సిబ్బందికి అవసరమైన ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జూన్ 1వ తేదీ ఉదయం నుంచే సిబ్బంది లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి నేరుగా పింఛన్లు అందజేయాలని స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని మండలాలు, పట్టణ ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీ సజావుగా జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. పంపిణీ ప్రక్రియలో పారదర్శకత, సమర్థత పాటించాలని అధికారులను ఆదేశించారు. వృద్ధులు, వికలాంగులు, ఇతర లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా గౌరవప్రదంగా సేవలు అందించాలని సూచించారు.
పింఛన్ల పంపిణీ బాధ్యతలు నిర్వహిస్తున్న సిబ్బంది లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించి, మర్యాదపూర్వకంగా పింఛన్లు అందజేయాలని కలెక్టర్ ప్రత్యేకంగా సూచించారు. పంపిణీ సమయంలో ఎటువంటి సమస్యలు తలెత్తినా వెంటనే సంబంధిత ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి అర్హులైన లబ్ధిదారునికి పింఛన్ సకాలంలో చేరేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
నియోజకవర్గాల వారీగా పింఛన్ల వివరాలు:
భీమవరం నియోజకవర్గంలో 30,075 మందికి రూ.13,18,72,500 పంపిణీ చేయనున్నారు.
ఆచంట నియోజకవర్గంలో 28,230 మంది లబ్ధిదారులకు రూ.12,31,59,500 అందించనున్నారు.
నరసాపురం నియోజకవర్గంలో 26,600 మందికి రూ.11,50,59,000,
పాలకొల్లు నియోజకవర్గంలో 28,584 మందికి రూ.12,47,94,500 పంపిణీ చేయనున్నారు.
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 30,378 మందికి రూ.13,41,32,500,
తణుకు నియోజకవర్గంలో 34,867 మందికి రూ.15,25,43,000 అందించనున్నారు.
ఉండి నియోజకవర్గంలో 34,227 మందికి రూ.14,86,19,500,
గణపవరం మండలంలో 8,398 మందికి రూ.3,75,58,000 పింఛన్లు నగదు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు.
