సురక్షిత చిత్తూరు కోసం జిల్లా వ్యాప్తంగా ఫుట్ పెట్రోలింగ్
చిత్తూరు (ఆంధ్రప్రభ బ్యూరో): ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడం, నేరాలను సమర్థవంతంగా నియంత్రించడం, భద్రతాభావాన్ని పెంపొందించడం లక్ష్యంగా “సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా గురువారం ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాన కూడళ్లు, మార్కెట్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విద్యాసంస్థల పరిసరాలు, వాణిజ్య సముదాయాలు, నివాస కాలనీలు, పార్కులు, ఆలయాలు, బ్యాంకులు, ఏటీఎంలు, సున్నిత ప్రాంతాల్లో పోలీసులు కాలినడకన గస్తీ నిర్వహించారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచారు.
ఈ సందర్భంగా ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ ప్రజల భద్రతే పోలీసు శాఖకు అత్యున్నత ప్రాధాన్యత అని తెలిపారు. నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే, నేరం జరగకుండా ముందుగానే నివారించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమన్నారు. ఫుట్ పెట్రోలింగ్‌తో పాటు విజిబుల్ పోలీసింగ్, వాహన తనిఖీలు, డ్రోన్ నిఘా, సీసీ కెమెరాల పర్యవేక్షణను మరింత విస్తృతంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. స్థానిక ప్రజలు, వ్యాపారులు, యువత, ఆటో డ్రైవర్లకు సైబర్ నేరాల నివారణ, మహిళల భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలన, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. ప్రతి పౌరుడు పోలీసులకు భాగస్వామిగా వ్యవహరించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-112కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థవంతంగా అరికట్టి “సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” లక్ష్యాన్ని విజయవంతం చేయగలమని ఎస్పీ పేర్కొన్నారు.
