ఆంధ్రప్రభ కథనానికి స్పందన…

ఆంధ్రప్రభ కథనానికి స్పందన…
కానీ ప్రయాణికుల్లో అసంతృప్తి
బోర్ నీటినే ఫ్రిడ్జ్ ద్వారా సరఫరా చేస్తున్న ఆర్టీసీ
ఆర్ఓ తాగునీరు అందించాలని ప్రయాణికుల డిమాండ్
మంథని, ఆంధ్రప్రభ : మంథని ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యపై ఆంధ్రప్రభలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించినప్పటికీ, చేపట్టిన చర్యలు అసంతృప్తికరంగా ఉన్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
నెలలుగా నిరుపయోగంగా ఉన్న వాటర్ ఫ్రిడ్జ్‌ను అధికారులు మళ్లీ ప్రారంభించినా, అందులో మినరల్ వాటర్ లేదా ఆర్ఓ శుద్ధి చేసిన నీటికి బదులుగా నేరుగా బోర్ నీటినే సరఫరా చేస్తున్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు. ఎలాంటి శుద్ధి ప్రక్రియ లేకుండా బోర్ నీటిని ఫ్రిడ్జ్ ద్వారా చల్లబరచి ప్రజలకు అందించడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
మండుతున్న ఎండల్లో బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులు దాహార్తి తీర్చుకునేందుకు ఆ నీటినే తాగాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు ఈ నీటిని వినియోగించాల్సి వస్తోందని చెబుతున్నారు.
ప్రయాణికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోకుండా కేవలం చూపు చర్యలకే పరిమితమయ్యారని స్థానికులు విమర్శిస్తున్నారు. తాగునీటి సౌకర్యం కల్పించామని చెప్పడానికి మాత్రమే ఫ్రిడ్జ్‌ను ప్రారంభించారని, కానీ శుద్ధి చేసిన మంచినీరు అందుబాటులో లేకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని అంటున్నారు.
ప్రయాణికుల సంక్షేమమే లక్ష్యమని చెప్పే ఆర్టీసీ యాజమాన్యం కనీస మౌలిక వసతుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. బస్టాండ్‌కు వచ్చే వందలాది మంది ప్రయాణికులకు సురక్షితమైన తాగునీరు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొంటున్నారు.
ఇప్పటికైనా ఆర్టీసీ డిపో యాజమాన్యం స్పందించి బస్టాండ్‌లో ఆర్ఓ శుద్ధి చేసిన తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని, ప్రయాణికులకు స్వచ్ఛమైన మంచినీరు అందించాలని మంథని పట్టణవాసులు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
