తెలంగాణ రాజకీయాల్లో కొత్త వివాదం.. క్షుద్ర పూజలపై నేతల మాటల యుద్ధం!

  • క్షుద్ర పూజల వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం
  • రేవంత్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు
  • హరీష్ రావుపై ఆరోపణలు.. ఘాటుగా స్పందన
  • మూఢ నమ్మకాలపై రాజకీయ రగడ
  • ప్రభుత్వంపై వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించేందుకేనా?
  • నేతల వ్యాఖ్యలపై సామాజిక వర్గాల్లో ఆందోళన
  • క్షుద్ర పూజల వరకు చేరిన రాజకీయ విమర్శలు

హైదరాబాద్, ఆంధ్రప్రభ పొలిటికల్ బ్యూరో : క్షుద్ర పూజలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో తీవ్రమైన కరువు ఏర్పడాలని పార్టీకి చెందిన నేత పొరుగు రాష్ట్రానికి వెళ్లి క్షుద్ర పూజలు చేశారని, ఈ పూజలే ఆ పార్టీని, నాయకులను అష్టదిగ్బంధనానికి గురిచేస్తాయని ఆయన మాట్లాడడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమాజంలో మూఢ నమ్మకాలను నిర్మూలించేందుకు, బాల్య వివాహాలను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ పెద్దఎత్తున ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు క్షుద్ర పూజలు చేస్తే, సంబంధిత కుటుంబాన్ని, వ్యక్తులను సామాజిక బహిష్కరణ చేసేవారు. అయితే, పీసీసీ అధ్యక్షుడు సీ మహేష్ కుమార్ గౌడ్ క్షుద్ర పూజల వ్యవహారాన్ని వెలుగులోకి తేవడం, అవసరమైతే నిరూపిస్తానని సవాల్ చేసిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం కూకట్‌పల్లిలో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. క్షుద్ర పూజల అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు.

నాస్తిక సంఘాలు, జన విజ్ఞాన వేదికలు మాత్రం ఈ తరహా వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నాయి. మంత్రాలకు చింతకాయలు రాలడం ఎంత నిజమో.. కరువు రావడానికి క్షుద్రపూజలు చేశారని ఆరోపించడం కూడా అంతే నిజమని, ఒకవేళ అదే జరిగితే, సమాజంలో ఎంతోమంది ఇటువంటి పూజలకు ప్రాధాన్యత ఇచ్చేవారని చెబుతున్నారు.

అయితే, కీలకమైన అంశాలనూ, ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించేందుకే అధికార పార్టీ క్షుద్రపూజల వంటివి తెరపైకి తీసుకువస్తోందని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ దుమ్మెత్తిపోస్తోంది. బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఇటీవల కర్ణాటక రాష్ట్రంలోని ఓ పేరొందిన ప్రధాన ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలను నిర్వహించారన్న ప్రచారం జరిగింది. పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి గాంధీ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించి క్షుద్ర పూజల కోసమే హరీష్ రావు పర్యటన సాగుతోందంటూ ఆరోపించారు. అనంతరం రెండు రోజుల వ్యవధిలోనే ఇదే అంశంపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరువు రావాలన్న కుట్రతో హరీష్ రావు క్షుద్ర పూజలు చేసినట్టు చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆధారాలన్నీ తన వద్ద ఉన్నాయని, అవసరమైతే వాటిని బయట పెడతానని హెచ్చరించారు. ఆ ఆరోపణలపై అంతే స్థాయిలో హరీష్ రావు కూడా ఘాటుగా స్పందించారు. ఒక హిందువుగా తాను దేవుడిని దర్శించుకున్నానని, అంతేకాని మహేష్ ఆరోపిస్తున్న విధంగా క్షుద్రపూజలు చేయాల్సిన అవసరం తనకు లేదని మండిపడ్డారు. అటువంటివి చేసేది, చేయించేది కాంగ్రెస్ పార్టీయేనని, అవి వారికి వెన్నతో పెట్టిన విద్య అని తీవ్రమైన విమర్శలు చేశారు.

సమకాలీన రాజకీయాల్లో సైద్ధాంతికంగా ఎదుర్కొనలేని సందర్భాల్లోనే ఇలాంటి అసందర్భ వ్యాఖ్యలు తెరపైకి తీసుకువస్తున్నారని సామాజిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నాగరిక సమాజంలో బాధ్యత గల స్థానంలో ఉన్న వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నేతలు అనుసరిస్తున్న ఆటవిక విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయేలా, ఉనికిని ప్రశ్నార్థకం చేసుకునేలా విధానాలు స్వయంకృతాపరాధమేనన్న చర్చ మొదలైంది. అన్ని రంగాల్లో చైతన్యంతో అభివృద్ధి చెందుతున్న సమాజంలో మూఢ నమ్మకాలను పెంచి పోషిస్తారా..? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అధికార పార్టీగా సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? అంటూ పార్టీలకు అతీతంగా, సామాజిక మాధ్యమాల వేదికగా విశ్లేషకులు నిలదీస్తున్నారు. ఇలాంటి అనాలోచిత వ్యాఖ్యలు నాగరిక ప్రపంచంపై దుష్ప్రభావం చూపేలా చేస్తాయని, ప్రజలను మూఢ నమ్మకాల వైపు ఉసిగొలిపే ప్రమాదం ఉందని అన్ని వర్గాల ప్రజల్లో ఆందోళన, అసహనం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజాక్షేత్రంలో నిలదీస్తున్న ప్రతిపక్ష నాయకులను ఎదుర్కొనలేక, వాస్తవాలను అంగీకరించలేక అధికార కాంగ్రెస్ డైవెర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందన్న కోణంలో తీవ్రస్థాయిలో విమర్శలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తరిస్తున్నాయి. ఇలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలపై సామాజికవేత్తలు, నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అధునాతన, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి దశాబ్దాల క్రితమే నాంది పలుకుతూ యువతను ఆ రంగంవైపు మళ్లించేలా బలమైన పునాదులు వేసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ స్ఫూర్తికి ఈ విధానం విరుద్ధమంటూ ఖండిస్తున్నారు. నేటి తెలంగాణాలో అనేక సామాజిక సమస్యలు పట్టి పీడిస్తున్నప్పటికీ, అవేవీ పట్టించుకోకుండా, రైతాంగాన్ని, గ్రామీణ ప్రజలను వెంటాడుతున్న సాగు, తాగునీటి ఎద్దడి సమస్యలను పరిష్కరించకుండా పీసీసీ చీఫ్ హోదాలో ఉన్న ప్రజా ప్రతినిధి మహేష్ కుమార్ క్షుద్ర రాజకీయాలకు తెరలేపడం పట్ల విపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తి నిందిస్తున్నాయి. ప్రజల్లో అపోహలను రూపుమాపాల్సిన బాధ్యత గల ప్రభుత్వంలో ఉన్న పెద్దలే ఇలాంటి ప్రమాదకరమైన సంస్కృతికి నాంది పలకడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్యలను ప్రభుత్వంగా, పార్టీగా బేషరతుగా ఉపసంహరించుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది. పాలిటిక్స్‌లో విమర్శలు, సవాళ్లు సాధారణమే కానీ.. తెలంగాణలో ప్రధాన రాజకీయపక్షాల నేతల మధ్య పొలిటికల్ వార్ ఏకంగా క్షుద్ర పూజల వరకూ వెళ్లింది. ఇది ఇంకెంత వికృత రూపం దాలుస్తుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్నది.