అసెంబ్లీకి రాకుండా.. ప్రజా సమస్యలపై ఎలా మాట్లాడతారు..?
ఏపీపీఎస్సీ అక్రమాలపై చర్చకు భయపడే అసెంబ్లీకి రావడం లేదు
డీఎస్సీ అంశంతో ఏపీపీఎస్సీ వ్యవహారాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం
ఉపాధ్యాయుల ఉద్యమాలైనా చూసి జగన్ బుద్ధి మార్చుకోవాలి
ఎంపీ కేసినేని చిన్ని
ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ కార్యాలయానికి శంకుస్థాపన
ఏడు, ఎనిమిది నెలల్లో కొత్త కార్యాలయం అందుబాటులోకి…
(విజయవాడ, ఆంధ్రప్రభ) : అసెంబ్లీకి హాజరుకాని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సమస్యలపై ఎలా మాట్లాడతారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రశ్నించారు. అసెంబ్లీకి రావడం, ప్రజా సమస్యలపై చర్చించడం ప్రతిపక్ష నాయకుడి బాధ్యత అని పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ వ్యవహారంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే జగన్ అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారని విమర్శించారు.
విజయవాడ ఆటోనగర్‌లో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయ నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన జరిగింది. జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు గద్దె రామమోహన్‌రావు, శ్రీరామ్ తాతయ్య, తంగిరాల సౌమ్యతో పాటు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిన్ని మాట్లాడుతూ.. ఎన్టీఆర్ వంటి మహానుభావుడి పేరుతో ఏర్పడిన జిల్లాలో టీడీపీ జిల్లా కార్యాలయానికి శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధతో పాటు పార్టీ ముఖ్య నాయకుల సమక్షంలో కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు. మరో ఏడు, ఎనిమిది నెలల్లో కార్యాలయాన్ని పూర్తిచేసి కార్యకర్తలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సొంత కార్యాలయం ఉండాలన్నది పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆశయమని చిన్ని తెలిపారు. పార్టీ కార్యాలయాలు కేవలం సమావేశాలకే పరిమితం కాకుండా కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండాలని, నాయకులు ప్రతిరోజూ కార్యకర్తలతో మమేకమై పార్టీని బలోపేతం చేయాలన్నదే వారి ఉద్దేశమన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపనలు జరుగుతున్నాయని చెప్పారు.
ఏపీపీఎస్సీపై చర్చ తప్పదు..
ఏపీపీఎస్సీలో అక్రమాలు జరిగాయన్న అంశంపై ప్రభుత్వం విచారణ జరిపి వివరాలను వెలుగులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో అసెంబ్లీలో దీనిపై చర్చ జరగాల్సి ఉందని ఎంపీ చిన్ని అన్నారు. ఇప్పటికే కమిషన్ నివేదిక కూడా అందిందని పేర్కొన్నారు. ఈ అంశంపై చర్చను పక్కదారి పట్టించేందుకు డీఎస్సీ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. డీఎస్సీ అంశాన్ని ముందుకు తీసుకొచ్చినా ఏపీపీఎస్సీపై చర్చ నుంచి తప్పించుకోలేరని అన్నారు. నారా లోకేష్, పవన్‌కల్యాణ్ కూడా ఏపీపీఎస్సీ వ్యవహారంలో వాస్తవాలను నిగ్గు తేలుస్తామని స్పష్టం చేశారని తెలిపారు. అసెంబ్లీలో ఈ అంశంపై సమగ్ర చర్చ జరగాలన్నారు.
ఉపాధ్యాయుల ఉద్యమాలైనా చూడాలి..
విద్యార్థులు, ఉపాధ్యాయులు తమకు డీఎస్సీ ద్వారా జరిగిన న్యాయంపై స్వచ్ఛందంగా ఉద్యమాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారని ఎంపీ పేర్కొన్నారు. కర్నూలులో జరిగిన కార్యక్రమాలను ప్రస్తావిస్తూ.. విజయవాడలోనూ ఉపాధ్యాయులు సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నారని విజయవాడ ఎంపీ చిన్ని తెలిపారు. ఉపాధ్యాయుల ఉద్యమాలను చూసైనా జగన్ తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు. గతంలో అసెంబ్లీకి సక్రమంగా హాజరు కాలేదని, ఇప్పుడు కూడా శాసనసభకు దూరంగా ఉంటున్నారని చిన్ని విమర్శించారు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించకుండా బయట రాజకీయ విమర్శలు చేయడం వల్ల ప్రయోజనం లేదన్నారు. ప్రతిపక్షంగా ప్రజల తరఫున సభలో ప్రశ్నించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ వ్యవహారంపై చర్చ జరగకుండా డీఎస్సీ అంశంతో దృష్టి మళ్లించే ప్రయత్నాలు చేస్తే ప్రజలే గమనిస్తారని చిన్ని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ నూతన కార్యాలయం నిర్మాణం పూర్తయిన తర్వాత జిల్లా పార్టీ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా, కార్యకర్తలకు అందుబాటులో ఉండే వేదికగా పనిచేస్తుందని తెలిపారు.
