అమృతమ్మ భూమికి పట్టా…

తహసీల్దార్‌ రాముడికి కృతజ్ఞతలు తెలిపిన రైతు


కాల్వ శ్రీరాంపూర్‌, ఆంధ్రప్రభ : పదేళ్లుగా తన భూమికి పట్టా కోసం అధికారుల చుట్టూ తిరిగిన ఓ మహిళా రైతు నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన మహిళా రైతు కంకణాల అమృతమ్మకు భూభారతి పోర్టల్‌లో భూమిని నమోదు చేసి పట్టా కల్పించడంతో ఆమె ఆనందం వ్యక్తం చేశారు. తన సమస్యను పరిష్కరించిన తహసీల్దార్‌ రాముడికి శుక్రవారం స్వీట్లు తినిపించి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

కిష్టంపేట గ్రామానికి చెందిన కంకణాల అమృతమ్మకు ఆ గ్రామ శివారు సర్వే నంబర్‌ 347/ఎ/బి/1 లో 0.30 గుంటల భూమి ఉంది. అయితే ఆ భూమికి పట్టా చేయించుకునేందుకు గత పదేళ్లుగా ఆమె తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతూ వచ్చింది. వివిధ పార్టీల నాయకులు, పలువురు అధికారులను కలిసి తన భూమికి పట్టా చేయించాలని వేడుకున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆమె తెలిపారు. పట్టా కోసం పలుమార్లు దరఖాస్తులు చేసుకున్నా ఫలితం లేకపోవడంతో ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వచ్చిందన్నారు.

ఈ క్రమంలో ప్రస్తుత తహసీల్దార్‌ రాముడిని కలిసి తన భూమికి పట్టా చేయించాలని అమృతమ్మ దరఖాస్తు చేసుకున్నారు. స్పందించిన తహసీల్దార్‌ రాముడు భూమికి సంబంధించిన రికార్డులను పరిశీలించి, వివరాలను భూభారతి పోర్టల్‌లో నమోదు చేయించారు. అనంతరం అమృతమ్మకు భూమిపై పట్టా కల్పించే ప్రక్రియ పూర్తిచేశారు. దీంతో పదేళ్లుగా ఎదురుచూస్తున్న తనకు ఊరట లభించిందని అమృతమ్మ ఆనందం వ్యక్తం చేశారు.

జీవితాంతం రుణపడి ఉంటా..
తన సమస్యను అర్థం చేసుకుని రికార్డులను పరిశీలించి భూభారతి పోర్టల్‌లో భూమిని నమోదు చేసి న్యాయం చేసిన తహసీల్దార్‌ రాముడు ఆర్ ఐ వినోద్ రెడ్డి జిపిఓ స్వాతి ల కు జీవితాంతం రుణపడి ఉంటానని మహిళా రైతు కంకణాల అమృతమ్మ పేర్కొన్నారు. పదేళ్లుగా పట్టా కోసం తిరిగినా పట్టించుకోని పరిస్థితుల్లో ప్రస్తుత తహసీల్దార్‌ స్పందించి సమస్యను పరిష్కరించడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. తనలాంటి రైతులకు అధికారులు ఇదే విధంగా స్పందించి న్యాయం చేయాలని ఆమె కోరారు. పట్టా చేతికి రావడంతో అమృతమ్మ కుటుంబ సభ్యులు సైతం హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని భూ సమస్యకు అధికారులు చొరవ చూపడంతో తమ కుటుంబానికి ఎంతో ఉపశమనం కలిగిందని తెలిపారు.