ఆంధ్రప్రభ ఎఫెక్ట్..

  • ఆంధ్రప్రభ కథనంతో కదిలిన అధికారులు
  • ఎల్లమ్మగుట్ట చౌరస్తా, డ్వాక్రా బజార్ వద్ద మురికి నీటి సమస్యకు మోక్షం

నిజామాబాద్ అర్బన్, ఆంధ్రప్రభ : ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంలో ఆంధ్రప్రభ మరోసారి తన బాధ్యతను చాటుకుంది. నిజామాబాద్ నగరంలోని రద్దీ ప్రాంతమైన ఎల్లమ్మగుట్ట చౌరస్తా, డ్వాక్రా బజార్ వద్ద రోడ్డుపై నిలిచిపోయిన మురికి నీటి సమస్యపై ఇటీవల ఆంధ్రప్రభ ప్రచురించిన కథనానికి నగరపాలక సంస్థ అధికారులు వేగంగా స్పందించారు.

స్పందించిన కమిషనర్.. రంగంలోకి సిబ్బంది

ఎల్లమ్మగుట్ట చౌరస్తా సమీపంలోని డ్వాక్రా బజార్ ఎదుట రోడ్డుపై మురికి నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఆంధ్రప్రభ ప్రత్యేక కథనం ద్వారా వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ కథనంపై నగరపాలక సంస్థ కమిషనర్ స్పందించి, సంబంధిత అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.

దీంతో శుక్రవారం ఉదయం కార్పొరేషన్ సిబ్బంది జేసీబీ యంత్రాలతో సమస్యాత్మక ప్రాంతానికి చేరుకున్నారు. మురికి నీరు నిలిచిపోవడానికి ప్రధాన కారణమైన డ్రైనేజీ సమస్యను గుర్తించి, యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టారు.

స్థానికులు, ప్రయాణికుల హర్షం

రోడ్డుపై మురికి నీరు నిలిచిపోవడంతో దుర్వాసన, దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్న స్థానికులకు, అటుగా రాకపోకలు సాగించే వాహనదారులు, పాదచారులకు మరమ్మతు పనులతో ఉపశమనం లభించింది.

సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసిన ఆంధ్రప్రభ పాత్రను స్థానికులు, వ్యాపారులు ప్రత్యేకంగా అభినందించారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి పరిష్కారానికి మార్గం చూపుతున్న ఆంధ్రప్రభ సేవలను పలువురు ప్రశంసించారు.