VTPS |ట్యాంక్ లో ఊపిరాడక పెయింటర్ మృతి

ఇబ్రహీంపట్నం, (ఆంధ్రప్రభ): ఎన్టీటీపీఎస్ ఐదో దశలో ప్రమాదవశాత్తు శనివారం ఓ కార్మికుడు మృతి చెందగా, మరో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది. సేకరించిన సమాచారం ప్రకారం ఐదో దశలోని డిగాసార్ మినరల్ వాటర్ ప్లాంట్ (డీఎండబ్ల్యూపీ) ట్యాంక్ లోపల పెయింటింగ్ పనులు చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఇద్దరు కార్మికులు పెయింటింగ్ వేసేందుకు లోపలికి వెళ్లినట్లు సమాచారం. సాయంత్రం అయినా వారు తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి ఓ కార్మికుడు లోపలికి వెళ్లి చూడగా ఒక కార్మికుడు ఊపిరాడక మృతి చెంది ఉన్నాడు.

మరో కార్మికుడు పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఎన్టీటీపీఎస్ ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన కార్మికుడిని గొల్లపూడిలోని ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి కార్మికుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే ఇద్దరు కార్మికుల పూర్తి వివరాలు తెలియరాలేదు. ఎన్టీటీపీఎస్ అధికారులు, పోలీసులు వివరాలు వెల్లడించకుండా గోప్యంగా ఉంచుతున్నారు.

ఇదే క్రమంలో రంగంలోకి దిగిన ఓ యూనియన్ నాయకులు కేసు లేకుండా పంచాయితీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఎన్టీటీపీఎస్ అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం వల్లే ఈ ఘటన జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. కార్మికులు పెయింటింగ్ పని చేసేటప్పుడు పర్యవేక్షించాల్సిన ఇంజనీర్ అక్కడ లేకపోవడంతో ఈ ఘటన జరిగినట్లు వాపోతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *