Voter List Revision | నేతలకు సీఎం రేవంత్ సూచ‌న‌

Voter List Revision | నేతలకు సీఎం రేవంత్ సూచ‌న‌

Voter List Revision | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) అంశాన్ని కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు సూచించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన జూమ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇంచార్జ్‌లు సహా పార్టీ ముఖ్య నేతలంతా ఈ సమావేశానికి హాజరయ్యారు.

సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఎస్‌ఐఆర్ అంశం చాలా సీరియస్ విషయమని, పార్టీ నాయకులంతా మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. కొందరు నాయకులు ఈ అంశంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అలాంటి వైఖరి పార్టీకి నష్టం కలిగిస్తే సహించబోమని హెచ్చరించారు. జిల్లాల వారీగా అవగాహన సదస్సులపై నివేదికలు తమ వద్ద ఉన్నాయని, కాంగ్రెస్ తరఫున మరిన్ని సదస్సులు నిర్వహించి ప్రజల్లో చైతన్యం కల్పించాలని సూచించారు. ఇంచార్జ్ మంత్రులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, సరిగా పని చేయకపోతే పేద ప్రజలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందన్నారు.

పేదల ఓట్లు తొలగిపోతే వారి హక్కులు దెబ్బతింటాయని, ఆధార్, రేషన్ కార్డులు వంటి సంక్షేమ పథకాలపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితి రాకుండా పార్టీ నాయకులు గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. పార్టీ ఆదేశాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసిన సీఎం, ఆదేశాలను పట్టించుకోని వారి స్థానంలో కొత్త ఇంచార్జ్‌లను నియమిస్తామని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని క్షమించబోమని, పని చేయకుండా పార్టీకి నష్టం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రాబోయే 10 రోజులు కీలకమని పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ సర్పంచ్‌లు, స్థానిక నాయకులతో కలిసి గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించి ఎస్‌ఐఆర్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. దీంతో ఒక్క అర్హుడి ఓటు కూడా కోల్పోకుండా చూసుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.